‘ఉచితం’ పై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సర్వీసు చార్జీ పెంచటంతో పాటు ఏళ్లనాటి పాత బకాయిలను వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఉచిత విద్యుత్‌కు 7 గంటలకు మించి సరఫరా చేస్తే జీతాలు కత్తిరిస్తామని ఉద్యోగులను హెచ్చరించింది. అదే సమయంలో వ్యవసాయానికి ఏడు గంటల కంటే తక్కువ విద్యుత్ సరఫరా అయితే గతంలో మాదిరిగా మరుసటి రోజు సర్దుబాటు చేయటం కుదరదనీ తేల్చిచెప్పింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెందిన కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ఈ ఆదేశాలు విద్యుత్ అధికారులు, సిబ్బందిలో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఉచిత విద్యుత్ సరఫరాను రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కుదించారు. వాస్తవానికి ఏదైనా ఒక రోజు సాంకేతిక కారణాలు అంటే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం, సబ్‌స్టేషన్‌కు పై నుంచి సరఫరా లేకపోవటం, విద్యుత్ సరఫరా లైన్లు తెగిపోవడం తదితర కారణాల వల్ల వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కాకపోతే.. ఆ మేరకు కొరత పడిన విద్యుత్‌ను మరుసటి రోజు సరఫరా చేయాలి. ఈ మేరకు డిస్కంలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక అలా చేయటం కుదరదని తాజాగా ఆదేశించారు. ఏ రోజైనా 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరిగితే ఉద్యోగుల జీతాలకు కోత విధిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించటంతో.. 7 గంటల కంటే సాధ్యమైనంత తక్కువగా ఇచ్చేందుకే అధికారులు మొగ్గుచూపుతున్నారు.
పారదర్శకతకూ పాతర...
గతంలో ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఫీడర్లకు ఎంత మేర విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలను ట్రాన్స్‌కో వెబ్‌సైట్లో వెల్లడించేవారు. పారదర్శకత కోసం ఈవిధంగా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు కూడా. అయితే.. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కావటం లేదనే విషయాన్ని ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకే ఫీడర్ల వారీగా ఎంత విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలతో ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది. దీంతో తమ తప్పు బయటపడుతోందని భావించిన ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ సమాచారం అందుబాటులో లేకుండా పోయింది.
వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకపోతుండటంతో.. అసలు ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడతారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి.. సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి.. తదనంతర ప్రభుత్వం ఈ పథకంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఎలాగైనా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక ఆంక్షలను తెరమీదకు తెచ్చింది. పరిమితులు విధించటం మొదలయింది. రెండున్నర ఎకరాల మాగాణి (తరిపొలం) దాటిన వారికి బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు జారీ అవుతున్నాయి. ఐఎస్‌ఐ మార్క్ పంపుసెట్లు వంటి డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఎం) నిబంధనలు పాటించని వారి నుంచీ విద్యుత్ బిల్లుల వసూలు షురూ అయ్యింది.
బకాయిల పేరుతో వేలల్లో బిల్లులు...
ఒకవైపు ఉచిత కనెక్షన్లకు సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న విద్యుత్ సంస్థలు.. మరోవైపు తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు 20 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు లేవు. దీంతో ఎంత విద్యుత్ వినియోగాన్ని వినియోగించారని లెక్కించటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 2009లో తత్కాల్ కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేశారు. తాజాగా 2004 నుంచి 2009 వరకు వాడుకున్న విద్యుత్‌కు చార్జీలు చెల్లిం చాలంటూ బకాయిల పేరిట రైతులకు బిల్లులు జారీచేస్తున్నారు. విద్యుత్ వాడకానికి సంబంధించి విద్యుత్ సంస్థలు వింత లెక్కను ముందుకు తెచ్చాయి. ‘వ్యవసాయానికి ఒక రైతు 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) సామర్థ్యం కలిగిన మోటారు వాడుతున్నారు. ఈ మోటారును వాడటం వల్ల గంటకు 3.73 యూనిట్లు (హార్స్‌పవర్‌కు 0.746 యూనిట్ల చొప్పున) కాలుతుంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ లెక్కన రోజుకు 26.11 యూనిట్లు.. నెలకు 783.3 యూనిట్లు.. ఏడాదికి 9,399.6 యూనిట్లు కాలుతుంది. యూనిట్‌కు 20 పైసల చొప్పున ఏడాదికి రూ. 1,879.92 చెల్లించాల్సి ఉంటుంది. 2004 నుంచి 2009 వరకు చెల్లించలేదు. కాబట్టి ఐదేళ్లకు మొత్తం రూ. 9,396 చెల్లించాల్సిందే’నని బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా పాత బకాయిల పేరుతో రైతులపై వందల కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపుతోంది.
సర్వీసు చార్జీ బకాయిల వడ్డన...
వైఎస్ 2004 నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఆ విద్యుత్ కనెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ. 20 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే.. రైతుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. ఈ సర్వీసు చార్జీని కాస్తా 2011 ఏప్రిల్ నుంచి రూ. 30కి పెంచారు. గతంలో వసూలు చేయని సర్వీసు చార్జీలు ఇప్పుడు చెల్లించాలంటూ 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల నుంచి బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని కలిపేసి ఇస్తున్నారు. దీనివల్ల రైతులపై ఏకంగా రూ. 216 కోట్ల మేర భారం పడుతుందని అంచనా.