అసెంబ్లీ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నో
ఎమ్మెల్యే దాస్ అనుబంధ పిటిషన్ కొట్టివేత
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలపై ప్రధాన పిటిషన్ విచారణకు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిలుపుదల కోసం కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే డి.వై.దాస్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణను రాజ్యాంగం విరుద్ధంగా ప్రకటించాలన్న ప్రధాన పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీచేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, అపాయింటెడ్ డే తరువాత ఎమ్మెల్యేలను ఇరు రాష్ట్రాలకూ విభజించడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డి.వై.దాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణ వల్ల పిటిషనర్‌కు వ్యక్తిగత నష్టమేమీ లేదని, ఎన్నికలు నిలిపేయాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం.. అనుబంధ పిటిషన్‌ను కొట్టేస్తూ, భవిష్యత్తులో జరగబోయే వాటి ఆధారంగా ఎన్నికలను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.