సభలో మాట్లాడుతున్న కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి ,పిఠాపురం టౌన్: అమలు చేయలేని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కురసాల కన్నబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం సినిమా సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్నబాబు మాట్లాడుతూ నిలబెట్టుకునే హామీలివ్వడం జగన్ నైజమని ఆయన అదే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడని ఆయన అన్నారు. రాజకీయ అవసరాలకు జనాన్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని గుండెల్లో పెట్టుకుని మదిలో దాచుకునే మనస్తత్వం జననేతదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి ఎంతకీ ఇవ్వకపోవడం వల్ల ముద్రగడ తునిలో నిర్వహించిన ధర్నాతో కేసులు పెట్టి అనంతరం కమిషన్ వేసి చేతులెత్తేసిన తర్వాత నివేదిక కోసం అడిగితే లాఠీలతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని కన్నబాబు అన్నారు.
ఆకలి కేకలతో కంచాలు కొడితే వేల కేసులు పెట్టిన చంద్రబాబుది మోసం కాదా అని ఆయన ప్రశ్నించారు. తూతూమంత్రంగా విలువలేని మంజునాథ కమిషన్ నివేదికను తయారుచేసి ఢిల్లీ పంపించడం మోసం కాదా అని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో సానుభూతితో ఉన్నాం, ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని వాస్తవ పరిస్థితులు చెప్పడం, జగన్ వివరించడం మోసం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి బిల్లు పంపిన తర్వాత చంద్రబాబు ఎప్పుడైనా కాపుల రిజర్వేషన్ల్ల గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నది ఎవరు అంటూ మాట్లాడారు. ముద్రగడ ఉద్యమాన్ని చూపిస్తున్నారని ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని మరిచారా అంటూ ఆయన ప్రశ్నించారు. జూన్ 12 రాజమహేంద్రవరానికి జననేత ప్రజాసంకల్ప యాత్ర వచ్చినప్పుడు గోదావరి బ్రిడ్జి ఎలా ఊగిందో చూశామని ఈ రోజు పాదయాత్ర ప్రభంజనంగా ఎలా సాగుతుందో చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రతీరోజు అభిమానంతో వచ్చే జనంతో అడుగుముందుకు పడని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. డబ్బులిచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకురావడం లేదని ప్రజాభిమానంతో ప్రజా సంకల్పయాత్ర ముందుకు సాగుతోందన్నారు.
పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దొరబాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల పిఠాపురంలో పేదలకు 3,200 ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగానన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయంగా తన పాలన అందించానన్నారు. ఆజన్మాంతం వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చరిత్రలో కొంతమందికే గుర్తింపు లభిస్తుందని రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగంలా సాగిందని, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి అన్నారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతూ పిఠాపురంలో నిరంకుశ పాలన సాగుతోందని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, గండేపల్లి బాబి, కురుమళ్ల రాంబాబు, బుర్రా అనుబాబు, అరిగెల రామన్నదొర, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment