నికర జలాలకూ ఎసరు
Published Tue, Aug 27 2013 2:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
నారాయణరెడ్డి, సాక్షి: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఏకాకిని చేసి ఇప్పటికే మిగులు జలాలకు భారీగా గండికొట్టిన ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు.. ఆంధ్రప్రదేశ్ వాటా నికర జలాలను కూడా దోపిడీ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నాయి. ఈ లక్ష్యంలో భాగంగానే ట్రిబ్యునల్ కొత్త ప్రతిపాదన పట్ల ఆ రెండు రాష్ట్రాలు ఒక తాటిపైకి వచ్చాయి. రెండు రాష్ట్రాలూ జట్టుకట్టి.. కొత్త పద్ధతి ఎట్టి పరిస్థితిలోనూ అమలు జరిగే విధంగా పావులు కదుపుతున్నాయి. ఎగువ రాష్ట్రాల లక్ష్యం నెరవేరితే.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చెందిన న్యాయమైన వాటా నీటిని కూడా భారీగా కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే వర్షాలు సరిగ్గా రాని సమయాల్లో తీవ్ర దుర్భిక్షానికి గురయ్యే ఆంధ్రప్రదేశ్.. కొత్త ప్రణాళికలు అమల్లోకి వస్తే భవిష్యత్తులో మరింత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులోనే పలు ప్రయోజనాలను పొందిన ఎగువ రాష్ట్రాలు.. సవరణలోనూ మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నాయి. కృష్ణానది నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు ఉద్దేశించిన బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సమావేశాల సందర్భంగా గత రెండు రోజుల పరిణామాలను పరిశీలిస్తే కర్ణాటక, మహారాష్ట్రల పథకం అర్థమవుతోంది. ఇప్పటివరకు మన రాష్ట్రానికే వాడుకునే స్వేచ్ఛ ఉన్న మిగులు జలాలను ట్రిబ్యునల్ తన మధ్యంతర తీర్పులో ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే.. నికర జలాలను కూడా ఎగువ రాష్ట్రాలు దోచుకోవటానికి సిద్ధమయ్యాయి. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే రాష్ట్రం మొత్తం 710 టీఎంసీల కృష్ణా జలాలను కోల్పోనుంది.
నికర జలాల్లో 352 టీఎంసీలకు ఎసరు...
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణానదిలో 2,130 టీఎంసీలు (75 శాతం డిపెండబులిటి ప్రకారం) ఉన్నట్లుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో మనకు 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలను కేటాయించారు. అయితే తాజా ప్రతిపాదన ప్రకారం మనకు ఎగువ నుంచి 459 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. మిగిలిన నీటిని అంటే 352 టీఎంసీల నీటిని మన రాష్ట్రంలో కురిసే వర్షపు నీటి ద్వారా పొందాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మన రాష్ట్రంలో వర్షం కురియక కరవు పరిస్థితి ఏర్పడితే నదిలోకి నీరు రాదు. దాంతో ఆ ఏడాది మనం ఎగువ నుంచి వచ్చే 459 టీఎంసీల నీటితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు రికార్డు ప్రకారం 811 టీఎంసీల నికర జల కేటాయింపు ఉన్నా.. 459 టీఎంసీల హక్కు వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఎగువ ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు కేటాయించిన 1,319 టీఎంసీలు (కర్ణాటకకు 734, మహ రాష్ట్రకు 585 టీఎంసీలను కలిపి) కంటే ఎక్కువ నీరు వచ్చినా.. వారు దిగువకు విడుదల చేయరు. ఇలా ఎక్కువ వచ్చిన నీటిని కూడా వాడుకునే అవకాశం వారికే ఉంటుంది. దీని ప్రకారం మనకు నదిలో 811 నికర జల కేటాయింపు పేరుకు మాత్రమే. ఇందులో దాదాపు సగం నీటిని ఎగువ రాష్ట్రాలే దోచేస్తాయన్నమాట.
మిగులు జలాల్లో 358 టీఎంసీల నష్టం...
రాష్ట్రానికి ఇప్పటికే 358 టీఎంసీల నష్టం వాటిల్లింది. కృష్ణానదిలో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 2,130 టీఎంసీల నికర జలంతో పాటు, 65 శాతం డిపెండబులిటీ ప్రకారం మరో 448 టీఎంసీల మిగుల జలాలు ఉన్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తన మధ్యంత తీర్పులో ప్రస్తావించింది. ఈ నీటిలో మనకు 190 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు 358 టీఎంసీలను కేటాయించింది. అందులో భాగంగానే కర్ణాటక నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుకు కూడా అంగీకరించింది. అంటే.. ఇప్పటి వరకు మనమే వాడుకుంటున్న 448 టీఎంసీల మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. దాంతో మన రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుంది. ఈ మిగులు జలాలపైనే ఆధారపడి మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు, కల్వకర్తి, నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు ప్రయోజనం కలిగే వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేయటం జరిగింది. ఒకవైపు 358 టీఎంసీల మిగులు జలాలూ కోల్పోయి.. మరోవైపు 352 టీఎంసీల నికర జలాలకూ గండికొడితే.. మొత్తం 710 టీఎంసీల నీటిని కోల్పోయే మన రాష్ట్రంలో కృష్ణా నది ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం పొంచివుంది.
జూన్, జూలైల్లోనే నీటి వినియోగం...
కొత్త పద్ధతి అమల్లోకి వస్తే.. ఖరీఫ్ సీజన్ మొదలయ్యే జూన్, జూలై మాసాల్లోనే నికర జలంతో పాటు, వరద నీటిని కూడా ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోనున్నాయి. అంటే మన రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండకున్నా.. కర్ణాటక, మహారాష్ట్రలు తమ ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించుకునే వీలు ఉంటుంది. దీనిపైనే మన రాష్ట్రానికి చెందిన ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. అసలు మిగులు జలాల గుర్తింపును రద్దు చేయాలని మొదటి నుంచీ మన అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నారు. అయితే.. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌కు నికర జలాలు రాకున్నా.. ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలను ఉపయోగించుకునే విధంగా కొత్త పద్ధతిని తెరపైకి తీసుకురావటం విశేషం. ఈ పద్ధతి అమలు కోసం కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లోనూ, ట్రిబ్యునల్ ముందు వాదనల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. కొత్త పద్ధతి వల్ల ఆంధ్రప్రదేశ్ హక్కులకు ఏమాత్రం భంగం కలగదనే వాదనను ముందుకు తీసుకువస్తున్నారు. నదిలో ఏ ప్రాంతం ఎంత వరకు వర్షం కురుస్తున్నది, ఎంత నీటి లభ్యత ఉంది అనే విషయాన్ని ఇప్పటికే నిర్ధారించటంతో పాటు, దానిని ట్రిబ్యునల్ ఆమోదించినందున దిగువకు 459 టీఎంసీలనే విడుదల చేయాలనే పద్ధతిపై పట్టుపట్టాయి. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఆందోళనను పరిగణలోకి తీసుకోకూడదని కర్ణాటక, మహారాష్ట్రలు పట్టుపడుతున్నాయి.
Advertisement