అదే కథ.. అవే వైఖరులు! | Krishna waters continued to dispute the old Cathay | Sakshi
Sakshi News home page

అదే కథ.. అవే వైఖరులు!

Published Mon, Aug 26 2013 2:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Krishna waters continued to dispute the old Cathay

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై వివాదంలో మళ్లీ పాత కథే కొనసాగింది! ఫలితంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు తమకు అందివచ్చిన నేపథ్యంలో పట్టు వీడటానికి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో చర్చలు ఫలించలేదు. ఈ చర్చలను ఇంజనీర్ల స్థాయిలో సోమవారం కొనసాగించాలని మూడు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావడం గమనార్హం. దీని ప్రకారం ట్రిబ్యునల్ విచారణ అయ్యాక మూడు రాష్ట్రాల ఇంజనీర్లు ట్రిబ్యునల్ కార్యాలయంలోనే సమావేశమై చర్చలు జరపనున్నారు.
 
 కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి జస్టిస్ బ్రజేష్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ట్రిబ్యునల్ కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన ప్రతిపాదనపై ట్రిబ్యునల్ గత సమావేశాల్లో మూడు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తాము అన్ని కోణాల నుంచీ ఆలోచించిన మీదటే జలాల వినియోగ సమస్యకు పరిష్కారంగా కొత్త ఫార్ములాను రూపొందించామని, అందువల్ల మూడు రాష్ట్రాల న్యాయవాదులు కలసి చర్చించుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది. ఆయా అభ్యంతరాల పరిష్కారంపై ఓ అవగాహనకు వచ్చి తగిన సూచనలను తదుపరి విచారణలో తమకు తెలియజేస్తే వాటిని పరిశీలిస్తామని ఈ నెల 2తో ముగిసిన ఐదు రోజుల విచారణ సందర్భంగా జస్టిస్ బ్రజేష్‌కుమార్ మూడు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు స్పష్టీకరించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కే 811 టీఎంసీల నీటిలో ఎగువ నుంచి రావాల్సిన 459 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్ర పూర్తిగా విడుదల చేసిన తర్వాతే ఆ రెండు రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకునేలా ట్రిబ్యునల్ ఒక ఫార్ములాను రూపొందించి గత విచారణలో మూడు రాష్ట్రాల పరిశీలనార్థం అందించింది. దీనిపై ఆ విచారణలోనే రాష్ట్రం తన అభ్యంతరాలను గట్టిగా తెలియజేయగా, కర్ణాటక, మహారాష్ట్ర వితండవాదం చేశాయి.
 
 ఏకాభిప్రాయ సాధన కోసం ట్రిబ్యునల్ చేసిన సూచన ప్రకారం ఆదివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ‘కావేరి’ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి, న్యాయవాది ఎం.ఆర్.శ్రీనివాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ ఎం.విశ్వేశ్వరరావు, ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు పి.ఆర్.కె.మూర్తి, వి.ఎస్.ఎన్.రాజు, వై.వి.ఎస్.రెడ్డి, సుబ్రహ్మణ్యం, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది జావళి, అడ్వొకేట్ జనరల్ రవివర్మ, నీటిపారుదల శాఖ సాంకేతిక సలహాదారు శ్రీరామయ్య ప్రభృతులతో కూడిన బృందం, మహారాష్ట్ర తరఫున దీపక్ నర్గోల్కర్, నీటిపారుదల శాఖ ముఖ్యాధికారుల బృందం హాజరయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రల తరఫున ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించిన ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు ఫాలి ఎస్.నారిమన్, అంద్యార్జున సమావేశానికి రాకపోవడం గమనార్హం.
 
 నిజానికి ట్రిబ్యునల్ సూచన చేసినపుడు అందుకు అంగీకరించిన మూడు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదుల్లో వారిద్దరూ ఉన్నారు. చర్చల ద్వారా ఏదైనా రాజీకి రావడం కుదురుతుందేమో ప్రయత్నించమని జస్టిస్ బ్రజేష్‌కుమార్ ఈ నెల మొదట్లో సూచించినపుడు అందుకు ఇరువురూ వెంటనే సుముఖత తెలిపారు. అలాంటిది ఇప్పుడు వారిద్దర్నీ ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ఇరు రాష్ట్రాల అధికారులను ప్రశ్నించగా... వారు రానక్కర్లేదని, ఇక్కడి చర్చల సారాంశాన్ని తాము వారికి నివేదిస్తామని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే, ఈ సమావేశంలో రాజీ ఏదీ కుదరదని, మొత్తంగా ఒరిగేది ఏమీ ఉండబోదని ఆ రెండు రాష్ట్రాలు ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఆ మేరకే నిశ్చిత వైఖరితో వచ్చినట్టు బోధపడుతోంది.
 
 మారని వైఖరులే కారణం...
 ఆదివారం చర్చల్లో మహారాష్ట్ర, కర్ణాటక పాత వైఖరులనే ప్రదర్శించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాలరాయడమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాలు వ్యవహరించాయని, ఇప్పటికే తమకు కలిసివచ్చిన అవార్డు అంశాల సవరణ సుతరామూ ఇష్టం లేదన్న తీరును కనబరిచాయని తెలిసింది. ట్రిబ్యునల్ కొత్త ప్రతిపాదనపై కర్ణాటక, మహారాష్ట్ర తమ మనసులో ఏముందో బయటపెట్టకుండా ఆంధ్రప్రదేశ్‌నే రాజీకి రమ్మన్నట్టుగా మాట్లాడాయని, దీంతో ఆ రాష్ట్రాల ప్రతిపాదనలు వెల్లడయ్యాక మన ప్రతిపాదనను బయటపెట్టడం మంచిదన్న తీరున ఆంధ్రప్రదేశ్ బృందం చర్చలు సాగించిందని సమాచారం. ఇది న్యాయవాదుల స్థాయిలో తేలే అంశం కాదని, ఇంజనీరింగ్ నిపుణులు కూర్చొని మథిస్తే ఫలితం ఉంటుందని కర్ణాటక నుంచి అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర  సరేనన్నాయి. తమ చర్చల్లో పురోగతి సాధ్యపడలేదని, అయితే ఇంజనీరింగ్ నిపుణుల చర్చలు జరుగుతాయని ట్రిబ్యునల్‌కు సోమవారంనాటి విచారణలో నివేదించాలని అంతిమంగా మూడు రాష్ట్రాలు అవగాహనకు వచ్చాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి సోమవారం ఢిల్లీకి రానున్నారని, ఆయనతో చర్చించిన మీదట ఇంజనీర్ల సమావేశంలో రాష్ట్రం ఏం చెప్పాలనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది.
 
 ముందే చెప్పడం అసమంజసం : సుదర్శన్‌రెడ్డి
 సమావేశం ముగిశాక రాష్ట్ర సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘సోమవారం నుంచి ట్రిబ్యునల్ ముందు వాదనలు తిరిగి మొదలవుతాయి. బహుశా కర్ణాటక ముందుగా వాదనలను వినిపించవచ్చు.
 
 మూడు రాష్ట్రాల న్యాయవాదులు, సాంకేతిక అధికారులు, ఇంజనీర్లం కూర్చుని చర్చించాం. ట్రిబ్యునల్ ప్రతిపాదనపై ముందుగా ఇంజనీర్లు చర్చిస్తే దానిపై మళ్లీ ఏదైనా మాట్లాడుకోవచ్చని, ఏమైనా చేయవచ్చని భేటీలో ఒక అభిప్రాయానికి వచ్చాం. సోమవారం ట్రిబ్యునల్ విచారణ తర్వాత మూడు రాష్ట్రాల ఇంజనీర్లు  సమావేశమై చర్చిస్తారు. ఆయా అంశాలపై సామరస్యపూర్వక పరిష్కారం వీలవుతుందా లేదా అనేది వారు చర్చిస్తారు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, ‘‘ఈరోజు సమావేశం ఏదో ఒక సమస్యపై చర్చకు కాదు. ఎవరికి ఏయే అభ్యంతరాలున్నాయి, వాటిని పరిష్కరించుకోవడానికి ఏం చేయవచ్చు, అలా చేయడం కుదురుతుందా లేదా అనేది చూడటం కోసమే ఇది జరిగింది. ప్రతిపాదనలంటూ ఏవైనా ఉంటే అవి రేపు తెలుస్తాయి. ఇప్పటికైతే ప్రతిపాదనలేం లేవు. ఆ రెండు రాష్ట్రాలవారు ఇంజనీర్ల దగ్గర ఏం చెబుతారు, వారెలా స్పందిస్తారనేది చూసి మన వైఖరి ఏమిటో చెబుతాం. ముందే మన ప్రతిపాదన ఏమిటో వెల్లడించడం సమంజసం కాదు’’ అని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement