'పగలూ, రాత్రి నువ్వే కలలోకి వస్తున్నావు'
తాడేపల్లి : ‘పగలూ, రాత్రి, నువ్వే కలలోకి వస్తున్నావు... ముద్దు మురిపెంతో ఊరిస్తున్నావు... ఒక్క ముద్దు పెట్టకుంటే చచ్చిపోతా... కాళ్ళావేళ్ళా పడి బతిమిలాడుతున్నా కనికరించటంలేదు.. మర్యాదగా ముద్దు ఇస్తావా.. లేదంటే నువ్వు బాత్‌రూమ్‌లో స్నానం చేసేటప్పుడు ఫొటోలు తీశాను. వాటిని నెట్‌లో పెడతా’ అంటూ వివాహితను వెంటాడి వేధిస్తున్న ఓ ఆకతాయికి బాధితురాలి బంధువులు మంగళవారం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి... ఉండవల్లికి చెందిన సంధు సురేష్ ఆవారాగా తిరుగుతుంటాడు. కొద్ది రోజులుగా స్థానిక సీతానగరానికి చెందిన ఓ వివాహితను వెంట పడివేధిస్తున్నాడు. ఆమె ఫోన్ నంబరు సంపాదించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడు. తనకు నిద్ర పట్టడంలేదని, కోరిక తీర్చాలని, కనీసం ముద్దైనా పెట్టాలంటూ వేధించసాగాడు. మొదట్లో అల్లరవుతానని భయపడ్డ బాధితురాలు ఎవరికీ విషయం చెప్పలేదు. వేధింపులు శృతిమించడం, బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఫొటోలు తీశానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగటంతో బాధితురాలు బంధువులకు విషయం చెప్పింది.
వారి సూచన మేరకు సురేష్‌కు బాధితురాలు ఫోన్ చేసి మంగళవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు రప్పించింది. అక్కడ కాపు కాసిన ఆమె బంధువులు ఆకతాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతడి శరీరంపై దుస్తులు తొలగించి పోలీసులకు అప్పగించారు. అయితే యువతిని వేధించింది తాను కాదని, తన స్నేహితుడని బుకాయించేందుకు అతడు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.