నరేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
లంగర్‌హౌస్: ప్రేమపేరుతో వేధించడమే కాకుండా అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఇద్దరు యువకులు చివరకు కటకటాలపాలయ్యారు. లంగర్‌హౌస్ ఎస్‌ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం..లంగర్‌హౌస్ పెన్షన్‌పురలో నివాసముండే ఓ యువతి (17) మెహిదీపట్నంలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. చాంద్రాయణగుట్టలో నివాసముండే మహ్మద్‌ఖాదర్(21) లంగర్‌హౌస్‌లోని బాగ్దాదీ దర్గా వద్ద పూలు అమ్ముతూ జీవిస్తున్నాడు. గత మూడునెలలుగా యువతి వెంట పడుతూ ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.
అసభ్యపదజాలంతో రోజూ లంగర్‌హౌస్ నుంచి మెహిదీపట్నం వరకు ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో విసుగు చెందిన ఆ యువతి విషయాన్ని ఆమె తమ్ముడు షోయబ్‌కు చెప్పింది. దీంతో షోయబ్ మంగళవారం ఉదయం దర్గా వద్దకు వెళ్లి ఖాదర్‌ను నిలదీశాడు. కోపోద్రిక్తుడైన ఖాదర్ కర్రతో షోయబ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఖాదర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అసభ్య మెసేజ్‌లు, ఈమెయిళ్లు..
సరూర్‌నగర్: ప్రేమంటూ ఓ యువతికి అసభ్య మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతూ వేధిస్తున్న ఓ విద్యార్థిపై మీర్ పేట పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీధర్‌రెడ్డి వివరాల ప్రకారం..ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న నరేశ్(20) అదే కాలేజీకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమపేరుతో ఏడాదిన్నరగా వేధిస్తున్నాడు.
విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా..వారు నరేశ్ కుటుంబసభ్యులను కలిసి హెచ్చరించారు. అయినా నరేశ్ ప్రవర్తన మార్చుకోకుండా సదరు యువతి సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు. విసిగివేసారిన యువతి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.