మినీ పవర్ ప్రాజెక్టు భూములపై జేసీ ఆరా | Mini Power Project lands JC Ara | Sakshi
Sakshi News home page

మినీ పవర్ ప్రాజెక్టు భూములపై జేసీ ఆరా

Published Thu, Aug 28 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

Mini Power Project lands JC Ara

ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ సమీపంలో మినీ పవర్ ప్రాజెక్టుకు  కేటాయించిన భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. రీష పవర్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ద్వారా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేటాయించిన భూములు ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పవర్ ప్రాజెక్టు, గెస్ట్‌హౌస్, నివాస గృహాలు నిర్మించాల్సిన భూములను తనిఖీ చేశారు. ఇక్కడ మినీ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని స్థానికులను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2002లోనే మినీ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ జెన్‌కోకు సంబంధించిన 12.03 ఎకరాలను రీష పవర్ లిమిటెడ్‌కు కేటాయించారని పేర్కొన్నారు. భూములను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
 
ఆధార్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు
 
ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో మరో రెండ్రోజుల్లో ఆధార్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామని జేసీ అన్నారు. మండలంలో ఇప్పటికి 73 శాతం మందికి ఆధార్‌కార్డులు ఉన్నాయని, లేనివారికి  ఫోటోలు తీసే వరకు రేషన్ అందిస్తామని చెప్పారు. జేసీ వెంట పాడేరు ఆర్డీఓ జి.రాజకుమారి, తహశీల్దార్ ఎం.శ్యాంబాబు, ఎంపీడీఓ ఎం.ఎస్.బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు

 
పెదబయలు:  ఆధార్ నమోదు వేగవంతం అవుతుందని, మరికొన్నిచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు చేస్తామని జేసీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం పెదబయలు ఆధార్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఒక్కరికి కూడా ఆధార్ నమోదు చేయకపోవడం, లబ్ధిదారులు నిరీక్షిస్తుండడంపై తహశీల్దార్ అంబేద్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆధార్ కేంద్రం నిర్వహకుడిని మార్చాలని, పెదబయలు మరో కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీవో రాజకుమారిని ఆదేశించారు. అంతకుముందు జేసీని స్థానిక ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, జెడ్‌పీటీసీ జర్సింగి గంగాభవాని కలసి పెదబయలు మండలంలో ఆధార్ కేంద్రం సరిగా పనిచేయడం లేదని, ఎక్కువచోట్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని  కోరారు.
 
నెలాఖరులోగా సీడింగ్ పూర్తిచేయాలి


పాడేరు: నెలాఖరులోగా ఆధార్ సీడింగ్‌ను పూర్తిచేయాలని జేసీ ప్రవీణ్‌కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక  సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 11 మండలాల తహ శీల్దార్లు, జీసీసీ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, పట్టాదార్ పాస్‌పుస్తకాలతో ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం సిటీ, అనకాపల్లి, న ర్సీపట్నం డివిజన్లతో పోల్చితే పాడేరు డివిజన్ చాలా వెనుకబడి ఉందని, ఉద్యోగుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధానం చేసేటప్పుడు గ్రామాల్లో వలస వెళ్లినవారు, చనిపోయినవారు, బోగస్‌కార్డులు వంటి వివరాలతో వేర్వేరు జాబితాలను తయారుచేసి సమర్పించాలన్నారు. ఇపాస్ బుక్ విధానం ద్వారా మీ సేవా కేంద్రాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని చెప్పారు. జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, తహశీల్దార్లు, జీసీసీ మేనేజర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement