పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చెప్పే హక్కు ఎవరకి లేదని బొత్స స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో నాయకులు సమయమనం పాటించాలని సూచించారు. రాజధాని ఎక్కడ అనేది అసలు సమస్యే కాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుంది, ఆ సమయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలిపేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సభలో ఉండాలని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ తీర్మానానికి పార్టీ పరంగా విప్ అనేది ఉండదని ఆయన తెలిపారు. పార్లమెంట్లో కూడా మెజార్టీ ఉంటేనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, శాంతిభద్రతలు, నదీ జలాల పంపిణీ, విద్యా, ఉద్యోగాలు తదితర అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వాటిని నివృత్తి చేయాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజల నివాసానికి, వారి ఆస్తులకు రాజ్యాంగపరమైన భరోసా ఉందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.