ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన జిల్లాలోని ఎనిమిది పంచాయతీ సర్పంచ్, 56 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ నం.757ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 6 వరకు ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరణ, 7న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ వేసిన అభ్యర్థులపై ఏమైనా అభ్యంతరాలుంటే 8న ఆర్డీవోకు ఫిర్యాదు, వాటిపై 9న ఆర్డీవో పరిశీలన, 10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి. అదే రోజు 3 గంటల తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 18న ఉదయం 7 గంటల మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, 2 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది.
జిల్లాలోని ఐదు పంచాయతీల్లో ఎస్టీ సర్పంచ్ అభ్యర్థులు లేక ఎన్నికలు వాయిదా పడగా, దమ్మపేట మండలంలో 2 పంచాయతీల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వైరా మండలం ఖానాపురంలో ఎస్సీ అభ్యర్థి లేక ఎన్నిక జరగలేదు. అలాగే బూర్గంపహాడ్ మండలం పెద్దవారిగూడెం సర్పంచ్ మరణించడంతో అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయా స్థానాలకు రిజర్వేషన్ ప్రకారం అర్హతగల అభ్యర్థులు ఉంటారా...లేక అదే పరిస్థితి పునరావృతమవుతుందా అనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికలు జరిగే పంచాయతీలు ఇవే....
దమ్మపేట మండలం లింగాలపల్లి (ఎస్టీ మహిళ), జమ్మేదారి బంజర (బీసీ మహిళ) , ఏన్కూర్ మండలం నూకలంపాడు(ఎస్టీ మహిళ), తిర్మలాయపాలెం మండలం రాజారం (ఎస్టీ జనరల్), వైరా మండలం ఖానాపురం(ఎస్సీ మహిళ), రఘనాధపాలెం మండలం కోయచెలక (ఎస్టీ జనరల్), భద్రాచలం మండలం వెంకటరెడ్డిపేట (ఎస్టీ జనరల్), బూర్గంపహాడ్ మండలం పెద్దవారిగూడెం(ఎస్టీ జనరల్) ఉన్నాయి.
56 వార్డులు ఇలా ఉన్నాయి ...
జిల్లాలో 21 పంచాయతీలోని 56 వార్డులకు మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దమ్మపేట మండలంలోని జమ్మేదారి బంజరలోని 10, లింగాలపల్లిలోని 10 వార్డులు, చింతకాని మండలం కోమట్లగూడెంలో 8వ వార్డు, అశ్వారావుపేట మండలం ఓట్లపల్లిలో 7వ వార్డు, ముల్కలపల్లి మండలం తిమ్మపేటలో 6వ వార్డు, తల్లాడ మండలం కేశావాపురంలోని 6వ వార్డు, బిల్లుపాడులో 7వ వార్డు, వేలేరుపాడు మండలం రుద్రమకోటలో 7వ వార్డు, కామేపల్లి మండలం ముచ్చర్లలో 7,9,10 వార్డులు, కొత్తగూడెంలో వెంకటేష్‌ఖని 2వ వార్డు, బయ్యారం మండలం కంబాలపల్లిలో 8వ వార్డు, ఏన్కూర్ మండలం నూకలంపాడు 1, 2, 3, 8 వార్డులు, భద్రాచలం మండలం వెంకటరెడ్డిపేటలో 1, 2, 4 వార్డులు, త్రిపురపెంటవీడులో 1,9 వార్డులు, నందిగామలో 4వ వార్డు, చర్లలోని పూసగుప్పలో 1వ వార్డు, దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో 1, 7, 10 వార్డులు, కూనవరం మండలం కాచవరంలో 1,4,5,6 వార్డులు, పెడరకూరులో 9వ వార్డు, మర్రిగూడెంలో 1,5,6 వార్డులు, టేకుబాకలో 2, 3, 5 వార్డులు ఉన్నాయి.
ఎనిమిది పంచాయతీల ఎన్నికకు నోటిఫికేషన్
Published Thu, Jan 2 2014 4:55 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
Advertisement