సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో సెప్టెంబరు 6న టీఆర్‌ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అధ్యర్యంలో ఢిల్లీలో గురువారం జరిగిన జిల్లా పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, కె.తారకరామారావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి బి.వినోద్‌కుమార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు దాసరి మనోహర్‌రెడ్డి, ఒడితల సతీష్‌బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత పారీపరంగా నిర్వహిస్తున్న మొదటి పెద్ద కార్యక్రమం ఇదే కావడంతో భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. జనసమీకరణ బాధ్యలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు.
హుస్నాబాద్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, చొప్పదండికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎ.రవీందర్‌రెడ్డి, మానకొండూరుకు పరకాల ఎమ్మెల్యే ఎం.భిక్షపతి, మంథనికి మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, పెద్దపల్లికి చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కోరుట్లకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సిరిసిల్లకు మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, హుజూరాబాద్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వేములవాడకు టి.రవీందర్‌రావు, రామగుండంకు పురాణం సతీష్, జగిత్యాలకు శ్రీహరిరావు, ధర్మపురికి నాగుర్ల వెంకటేశ్వరరావులకు కూడా బాధ్యతలు ఇచ్చారు. పౌరసత్వం కేసులో ఎన్నిక చెల్లదని ఇటీవలే హైకోర్టు స్పష్టం చేసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించారనే విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు వెల్లడించలేదు.
అచ్చొచ్చిన సెంటిమెంట్..
2001లో టీఆర్‌ఎస్ ఏర్పాటు తర్వాత తొలి బహిరంగసభ ఎస్సారార్ కాలేజీ మైదానంలోనే నిర్వహించారు. ఈ సభతోనే టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో బాగా స్పందన వచ్చింది. దీంతో ఆ తర్వాత పార్టీ పరంగా చేపట్టిన దాదాపు అన్ని కార్యక్రమాలను కేసీఆర్ జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడానికి కారణమైన నిరహారదీక్ష వేదిక సిద్ధిపేట అయినా... కేసీఆర్ కరీంనగర్ నుంచే అక్కడికి బయలుదేరారు. మార్గమధ్యంలో అల్గునూర్ వద్ద కేసీఆర్ అరెస్టు కావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోసారి తెలంగాణ ప్రకటన రావడానికి అనివార్య పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ పాత్ర ఏమిటనేది చెప్పేందుకు కేసీఆర్ బాగా అచ్చివచ్చిన ఎస్సారార్ కాలేజీ మైదానాన్నే వేదికగా చేసుకోవడం విశేషం.
రేపు భేటీ...
టీఆర్‌ఎస్ బహిరంగసభ నిర్వహణ విజయవంతం కోసం శనివారం జిల్లా స్థాయి పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తెలిపారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, అన్ని స్థాయిల ముఖ్యనేతలను ఈ భేటీకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్‌కు అన్ని సందర్భాల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, బహిరంగసభ ద్వారా వీరికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతారని చెప్పారు. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు... రాష్ట్ర ఏర్పాటు కోసం 13 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కు ఉన్న తేడాను ఈ బహిరంగసభలో వివరిస్తామని శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలను ఆహ్వానిస్తున్నట్లు శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆరున జోరు
Published Fri, Aug 30 2013 6:13 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
Advertisement