పోలీస్ నీడలో విజయనగరం
Published Mon, Oct 7 2013 3:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
విజయనగరం కలెక్టరేట్/కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : విజయనగరం పట్టణం పోలీస్ నీడలో ఉంది. కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే పోలీస్ వాహనాల సైరన్‌తో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో ఉన్న పోలీసులతోపాటు, పొరుగు జిల్లాల నుంచి రెండు వేల మంది అదనపు సిబ్బందిని రప్పించారు. వీరితో పాటూ ఆరు ప్లాటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, రెండు కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒక కంపెనీ సీఆర్‌పీఎఫ్ బలగాలను దించారు. వీటితోపాటూ సోమవారం జిల్లా కేంద్రానికి బీఎస్‌ఎఫ్ కంపెనీ ఒకటి చేరుకోనుంది. మొత్తమ్మీద ఎనిమిది వేల మంది వరకూ పోలీసులు పట్టణంలో పహారా కాస్తున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో జన సంచారం లేదు. వీధుల్లో సైతం పోలీసులు పరుగులు తీయడంతో.. ప్రజలు భయంతో ఇళ్లలో ఉండి, తలుపులు మూసుకున్నారు. రోడ్లపై బలగాలను చూస్తున్న ప్రజలు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. బొత్స దాష్టీకానికి జిల్లాలో అశాంతి నెలకొందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఐజీ ఆధ్వర్యంలో బందోబస్తు
ఐజీ ద్వారకా తిరుమల రావు ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. ఆయన స్వయంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యేకాధికారిగా వచ్చిన ఏలూరు డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్ సైతం లాఠీ చేతబట్టి వీధుల్లో ప్రజలను హెచ్చరిస్తూ కనిపించారు. ఎస్పీ కార్తీకేయ, శ్రీకాకుళం ఎస్పీ నవీన్‌గులాఠీలతోపాటు, పలువురు ఏఎస్పీలు, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
‘ఛీ’ఆర్‌పీఎఫ్!
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : కర్ఫ్యూ పేరిట పోలీసులు ఆదివారం విధ్వంసం సృష్టించారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా దొరికిన వారిని దొరికినట్లే చితకబాదేశారు. అప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఇళ్లలోకి చొరబడి.. లోపల ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. స్థానిక పోలీసులు సంయమనం పాటిస్తూ వస్తున్నా... కేంద్ర బలగాలు(సీఆర్‌పీఎఫ్) మాత్రం ప్రతాపాన్ని చూపాయి. మహిళలు, చిన్నారులు, యువతపై వారు ప్రవర్తించిన తీరు పట్టణవాసులను కలిచివేసింది. ఆగ్రహం తెప్పించింది. పట్టణంలోని కొత్తపేట, ఇప్పిలివీధి, అద్దేపల్లివారివీధి తదితర ప్రాంతాల్లో పోలీసు బలగాలు తీవ్రస్థాయిలో మోహరించాయి. కర్ఫ్యూ అంటే ఏమిటో తెలియని స్థానికులు.. వేరే యూనిఫాంలో ఉన్న పోలీసులను చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. వారు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే... కేంద్రబలగాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అర్థం కాని భాషలో తిడుతూ.. కనీసం మహిళలని కూడా చూడకుండా నెట్టివేస్తూ సీఆర్‌పీఎఫ్ పోలీసులు లాఠీలతో ప్రతా పం చూపించారు. చిన్నారులను సైతం వదిలిపెట్టకుండా చితకబాదేశారు. దాదాపు గంటన్నరకు పైగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ బలగాల దాడిలో సుమారు పది మంది వరకూ స్థానికులు గాయపడ్డారు. గాయపడిన వారికి 108 వాహనంలో ప్రథమచికిత్స అందజేశారు.
సహనం నశించి..
సీఆర్‌పీఎఫ్ బలగాల తీరుతో విసిగిపోయిన ఇప్పిలివీధి మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇళ్లలోకి దూరి మరీ తమవారిని కొట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బొత్స సత్తిబాబు చేసిన నిర్వాకం వల్ల తమను కనీసం ఇళ్ల ముందు కూడా తిరగనీయకుండా చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతికందిన రాళ్లను, కర్రలను తీసుకుని సీఆర్‌పీఎఫ్ బలగాలపైకి విసిరారు. పోలీసులకు శాపనార్థాలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
గాజులరేగలో ఉద్రిక్తం
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : సీఆర్‌పీఎఫ్ బలగాల తీరుతో గాజులరేగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పట్టణంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రచారం నిర్వహించకపోవడంతో ప్రజలు యథావిధిగా తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా నీటి కోసం ఉదయాన్నే మహిళలు వీధి కుళాయిల వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన సీఆర్‌పీఎఫ్ బలగాలు.. లాఠీలు ఝలిపించారు. మహిళలని చూడకుండా చేయి చేసుకున్నారు. బహిర్భూమికి వెళ్తున్న యువకులను సైతం వెంబడించి మరీ కొట్టారు. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులందరూ ఏకమై సీఆర్‌పీఎఫ్ బలగాలపై ఎదురుదాడికి దిగారు. అదే విధంగా బొత్స సత్యనారాయణకు చెందిన సీతం కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాలపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు.
అక్కడే పహారా కాస్తున్న పోలీసులపైకి రాళ్లు, కర్రలు విసిరారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఇదే సమయంలో సమైక్యవాదులతో అక్కడకు చేరుకున్న తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు పోలీసులతో చర్చలు జరుపుతుండగా.. మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసు బలగాలు లాఠీలు ఝులిపించాయి. కాసేపు అక్కడ వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు ప్రజలు గాయాలపాలయ్యారు. నర్సింగరావుకు లాఠీ తగిలి కుడిచేయి మణికట్టు విరిగిపోయింది. వెంటనే అతనిని అందుబాటులో ఉన్న ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చేర్పించారు.
దాసన్నపేటలో యుద్ధకాండ
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : పోలీసులు, కేంద్రబలగాల తీరుతో విసుగు చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. సీసాలు, రాళ్లతో దాడి చేశారు. పట్టణంలోని దాసన్నపేట రింగ్‌రోడ్డు, రైతుబజార్ జంక్షన్‌లో ఉన్న పోలీసు బీట్‌ను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో పోలీసులు 10 రౌండ్ల బాష్పవాయువును ప్రయోగించారు. ఇదే సమయంలో ఎస్.కోట నుంచి బంధువుల ఇంటికి వెళ్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని చితకబాది రోడ్డుపై పడేశారు. గాయపడిన వ్యక్తి తమ ప్రాంతానికి చెందిన వాడేనని భావించిన దాసన్నపేట, రాజీవ్‌నగర్ వాసులు రోడ్లపైకి వచ్చి పోలీసులపైకి రాళ్లు విసిరారు. రహదారులకు అడ్డంగా స్తంభాలు, చెట్లు వేసి తగలబెట్టి నిరసన తెలిపారు. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. శాంతిభద్రతల ప్రత్యేకాధికారి విక్రమ్‌సింగ్‌మాన్ అక్కడకు చేరుకుని పోలీసులకు, కేంద్ర బలగాలకు సూచనలు అందించారు. ఉదయం పదిగంటల నుంచి ప్రారంభమైన రాళ్లదాడి, పరస్పర ప్రతిచర్యలు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఇళ్లలోనే గడిపారు.
Advertisement