మాచవరం(రాయవరం), న్యూస్‌లైన్ : సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశించిన స్థాయిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించడం లేదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. మాచవరంలో ఉప సర్పంచ్ సబ్బెళ్ల కాశీఈశ్వరరెడ్డిని వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించిన సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరితంగా నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ సహకరించడం వల్లే కాంగ్రెస్ ఇలా వ్యవహరించిందన్నారు. విద్య, ఆరోగ్యం, నీరు, విద్యుత్, రెవెన్యూ, నూతన రాజధాని ఏర్పాటు తదితర విషయాలపై స్పష్టత లేదని వివరించారు. విద్యార్థులు, వ్యాపారులు, రైతులు తదితర వర్గాల భవిష్యత్తు రాష్ట్ర విభజనతో ముడిపడి ఉందన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కాకపోతే ముందు తరాలు చీకట్లోకి నెట్టబడతాయన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కొందరి స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని ముక్కలుగా చేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లు రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, పాలచర్ల శ్రీనివాస్, నీటి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ నేతలు సత్తి వీర్రెడ్డి, సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు సహకరించడం లేదు
Published Wed, Aug 7 2013 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement