విశాఖకు ‘రాజ’ యోగం!
- నేడు రాజధాని ఎంపిక కమిటీ రాక
- సానుకూలాంశాలే ఎక్కువ
- కమిటీ పర్యటనతో చిగురిస్తున్న ఆశలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం జిల్లాకు వస్తోంది. కొత్త రాష్ట్రానికి రాజధానిగా విశాఖ జిల్లాకు ఉన్న అర్హతలపై కసరత్తు చేయనుంది. ఈ కమిటీ విశాఖతో పాటు విజయవాడ కూడా పర్యటిస్తుంది.
విశాఖలో మౌలిక సదుపాయాలు, జిల్లాకున్న అర్హతలతో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో సీమాంధ్ర రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం మార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న వనరులు అంచనా వేసుకుంటూ.. ఈ కమిటీ సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లో దేనికి రాజధానిగా అర్హతలున్నాయన్న విషయంపై దృష్టి సారించింది. దీని కోసం ప్రధాన జిల్లాల్లో పర్యటించనుంది. తొలుత శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించనుంది.
ఈ కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖవాసుల్లో రాజధాని ఆశలు రేకెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి ఈ కమిటీ చేరుకుంటుంది. ఇందులో చైర్మన్ కె.శివరామకృష్ణన్‌తో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రథిన్‌రాయ్, బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ డెరైక్టర్ అరోమర్ రేవి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, హైదరాబాద్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు.
వీరు ఆ రోజు రాత్రి ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయనున్నారు. 10న జిల్లాలోనే అధికారులతో సమావేశమై జిల్లాలో ప్రభుత్వ భూములు, ఇతర మౌలిక సదుపాయాల విషయాలను సేకరించనున్నారు. 11న విజయవాడ వెళ్లనున్నారు.
విశాఖపై అంచనాలు
రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటిస్థాయిలో విశాఖ విశేషాభివృద్ధి చెందుతోంది. పర్యాటకంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.
పారిశ్రామిక రాజధానిగా పేరుపొందింది. హైదరాబాద్ తరువాత పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సీమాంధ్ర రాజధానిగా అన్ని అర్హతులు 13 జి ల్లాల్లో విశాఖకే పుష్కలంగా ఉన్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వారి ఎన్నికల అజెండాలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించాయి.
మౌలికవసతులు పుష్కలం
రోడ్డు, జల, వాయు మార్గాలకు అనువైన ప్రాంతంగా రాష్ట్రంలోనే విశాఖ గుర్తింపు పొందడంతో రాజధాని రేసులో నిలిచింది.
అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి దిశగా పయనిస్తుండడంతో విశాఖను రాజధానిగా నిర్మాణానికి వ్యయం కూడా తక్కువగా అవుతుందన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయంతో పాటు ఓడరేవు, స్టీల్‌ప్లాంట్, పోర్టు, హెచ్‌పీసీఎల్, డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, ఎన్‌ఎస్‌టీఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్ తరువాత అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది. సింగపూర్, దుబాయ్ ఇలా అంతర్జాతీయ నగరాలకు వెళ్లడానికి విమాన సదుపాయాలున్నాయి. కొద్ది రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ విమానాలు విశాఖ వాకిట నుంచి ఎగురనున్నాయి.