కాటేస్తే.. కాటికే.! | Snakebite Cases Hikes In YSR kadapa | Sakshi
Sakshi News home page

కాటేస్తే.. కాటికే.!

Published Wed, Oct 24 2018 1:47 PM | Last Updated on Wed, Oct 24 2018 1:47 PM

Snakebite Cases Hikes In YSR kadapa - Sakshi

సాక్షి కడప: ప్రస్తుత సీజన్‌లో విషసర్పాల సంచారం అధికమైంది. గడ్డిపొదల చాటున.. దంతెల మాటునో.. పాత గోడల సందుల్లోనో..కుళ్లిన వ్యర్థ పదార్థాల మధ్యనో సర్పాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పైగా వర్షం పడిన సందర్భంలో ఉక్కపోతకు లోపల ఉండలేక రోడ్లపైకి రావడం మనకు కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం బారిన పడక తప్పదు. అయితే అక్కడక్కడ పాముకాటుతో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో కొన్నిచోట్ల విషానికి విరుగుడు ఇంజక్షన్లు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరించి అన్నిచోట్ల మందులు ఉండేలా చర్యలు చేపట్టాలి.

సీజన్‌లో పాములతో ప్రమాదం ప్రమాదమే. జూన్‌ నుంచి డిసెంబరు వరకు విష సర్పాలు ఎక్కువగానే సంచరిస్తుంటాయి. ఎందుకంటే వర్షాకాలంతోపాటు చలికాలంలో గడ్డి బాగా పెరగడం, ముళ్ల పొదలు, పంట పొలాలు కూడా పచ్చగా ఉండడంతో వాటి మధ్య ఉండటానికి అవకాశం ఉంటుంది. రాత్రి పూట కూడా పొలాల్లో...గట్లమీద, కాలువల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది.  జూన్‌ నుంచి డిసెంబరు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురిసిన సమయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తేనే ప్రమాదాన్ని పసిగట్టగలం.

జిల్లాలో అనేక రకాల పాములు
 మన ప్రాంతంలో కట్లపాము, నాగుపాము, రక్తపింజిరి, జర్రిపోతు, కోడె నాగు, పసిరిక పాము తదితర జాతికిచెందిన పాములే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో కొండచిలువ లాంటి పాములు అరుదుగా కనిపిస్తున్నా జనవాసాల్లోకి రావడం తక్కువే. అందులోనూ కొన్ని పాముల్లో విషం ఉంటే, మరికొన్ని పాముల్లో విషం ఉండదని పరిశోధకులు వివరిస్తున్నారు.

పాముకాటేస్తే పరేషాన్‌
జిల్లాలో పాము కాటుకు గురైన వారికి వేయాల్సిన యాంటీ వీనమ్‌ మందులను కొన్ని పీహెచ్‌సీల్లో సంబంధిత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కొనుగోలు చేస్తే.. కొన్నిచోట్ల స్టాకు లేదని తెలుస్తోంది.  ఎక్కడైనా మారుమూల పల్లెల్లో పాముకాటుకు గురైన వారు నేరుగా పీహెచ్‌సీకి వస్తారు. తర్వాతే ఎక్కడైనా పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చిన బాధితులకు సకాలంలో విషానికి విరుగుడు మందు అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపై ఉంది.

రికార్డుల్లో మరణం లేదు
జిల్లాలో ఈ జూన్‌ నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కేవలం ముగ్గురు మాత్రమే పాముకాటుకు గురైనట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. వారు కూడా పాముకాటుకు గురైన తర్వాత కోలుకున్నట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన వృద్ధురాలు రామసుబ్బమ్మ (70), అదే మండలంలోని అరవీడు పంచాయతీకి చెందిన శశికళ జులై నెలలో పాముకాటుకు గురై తుదిశ్వాస వదిలారు. అలాగే బద్వేలులోని విద్యానగర్‌కు చెందిన కె.నాగమ్మ (65) అనే మహిళ అక్టోబరు 4న పాముకాటుతో తనువు చాలించింది. ఇంకా జిల్లాలో అనేక మంది విష సర్పాల కాటుకు గురైనా అధికారిక లెక్కల్లో మాత్రం కేవలం ముగ్గురే ఉండడం చూస్తే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.
ముంపు వాసులను

బెంబేలెత్తిస్తున్న పాములు
 జిల్లాలోని గండికోట ముంపు గ్రామాల పరిధిలో పాములు హడలెత్తిస్తున్నాయి. గండికోట జలాలు ఇప్పటికే గ్రామాలను చుట్టుముట్టడంతో పాముల సంచారం ఎక్కువైంది. నీళ్లలోనుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని ముంపు బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విష సర్పాలు..పాముకాటుపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాలివీడు మండలం అరవీడు పంచాయతీ కూర్మయ్యగారిపల్లెకు చెందిన కె.శశికళ జులై 29న పాముకాటుకు గురైంది. ఆమె వారు సాగు చేసిన బొప్పాయి తోటలో గడ్డి తీస్తుండగా రక్తపింజరి సర్పం కాలికి కాటేసింది. వెంటనే భర్త మల్‌రెడ్డి ఆమె ఇంటికి రాగానే నేరుగా కుటుంబీకులు బెంగళూరుకు తీసుకెళ్లి వైద్యం అందించారు. మూడు రోజుల తర్వాత ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.  

పులివెందుల నియోజకవర్గంలోని ఓ పీహెచ్‌సీ పరిధిలో ఇటీవల ఓ రైతు దానిమ్మ తోటకు మందు పిచికారీ చేస్తున్నాడు. చెట్టు మీద ఉన్నదో లేక కింద ఉన్నదో తెలియదుగానీ ఒక కాలికి పురుగు కాటు వేసింది. తర్వాత కొద్దిసేపటికీ మరో కాలికి కాటేయడంతో భయపడిన ఆయన 24 గంటల ఆస్పత్రికి పరుగులు తీశాడు. అప్పటికే ముఖమంతా వాపు వచ్చి మొత్తం చెమటలతో శరీరమంతా తడిసిపోయింది. ఒకింత భయంతో ఆందోళన చెందుతున్న ఆయనకు ధైర్యం చెప్పి పీహెచ్‌సీ వైద్యులు ఇంజక్షన్‌ అందించారు.

మందుల కొరత లేదు
జిల్లాలో పాముకాటుకు సంబంధించి ఎక్కడా కూడా మందుల కొరత లేదు. అన్నిచోట్ల పాము కాటు విషం విరుగుడుకు వాడే మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులే నమోదయ్యాయి. అందులోనూ మరణాలు లేవు.    
– డాక్టర్‌ ఉమాసుందరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement