కోడి పందాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ : కోడి పందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోడి పందాలను నిషేధించడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తమను చేర్చుకోవాలన్న సొసైటీ ఫర్ యానిమల్స్ సంస్థకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సంస్కృతి సంప్రదాయాల్లో కోడి పందాలు భాగమని, వాటిని నిషేధించడం తగదని చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జంతువులను హింసించడం తగదని భావించిన హైదరాబాద్ హైకోర్టు... ఈ మధ్యే కోడిపందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది.
దాంతో హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనుగడ కోసం ఒక ప్రాణి మరో ప్రాణిని చంపడం సృష్టి ధర్మమని, దాన్ని హింసగా భావించడం సబబు కాదని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కోడి పందాలు సంప్రదాయ ఆటని... దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కోర్టుకు తెలిపారు. పాశ్చత్య పోకడలకు మొగ్గు చూపుతున్న యువతకు మన సంప్రదాయ ఆటల గురించి చెప్పడం తప్పెలావుతుందని వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రితో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు గురువారమే విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది లేకపోవడంతో... పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేసింది. తాజాగా విచారణ సోమవారానికి వాయిదా పడింది.