సొమ్ములిస్తేనే తమ్ముడు
సొమ్ములిస్తేనే తమ్ముడు
Published Wed, Feb 5 2014 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి, కొత్తముఖాలైనా పర్వాలేదు డబ్బు ఖర్చుపెట్టగలిగేవారిని వెతకండని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆ దిశగా ముఖ్య నేతల వ్యూహాలపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. రంపచోడవరం, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, కొత్తపేట, రాజమండ్రి సిటీ, రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలు ఇప్పటికే ఈ జాబితాలో ఉండగా ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
రంపచోడవరం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్ ఆశిస్తున్నారు. శీతంశెట్టి మధ్యలో పీఆర్పీకి వెళ్లినా తిరిగి ీడీపీకి వచ్చేశారు. ఈసారి వారిద్దరిని పక్కనపెట్టి సొమ్ములున్న అభ్యర్థిని వెతికే పనిలో ఉన్న ముఖ్యనాయకులు రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి సోదరుడు అ ప్పారావును గుర్తించారు. వైద్యఆరోగ్యశాఖలో పనిచేసి ఆరోపణలు ఎదుర్కుంటు న్న అప్పారావు పేరు పరిశీలనలో ఉండడంపై మాజీ ఎమ్మెల్యేలిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలో నాయకత్వ లేమి టీడీపీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పార్టీ అధినేత చంద్రబాబు విధానాలతో విసిగి వైఎస్సార్‌సీపీకి వెళ్లిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది. ఈ సీటు కోసం గోలి రామారావు, ముత్యాల రాజబ్బాయి పోటీపడుతున్నారు. అయితే వారిద్దరినీ కాదని ఆర్థికస్థోమతే ప్రాతిపదికగా ప్రగతి కృష్ణారావును తెరమీదకు తెచ్చారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాపు సామాజికవర్గం నుంచి గోరకపూడి చిన్నయ్యదొరను పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేమిటేని వారు ప్రశ్నిస్తున్నారు.
పశ్చిమగోదావరికి చెందిన చిన్నయ్యదొరను పార్టీలోకి తీసుకోవడంతోనే ఆయనకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో ఆశావహులు తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. సీటు కాపులకే ఇవ్వాలనుకుంటే తుమ్మల బాబు లేరా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్తిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుకు ఎసరుపెట్టే ప్రయత్నాలపై కేడర్ గుర్రుగా ఉన్నారు. ఆరోగ్య కారణాలు, స్థానికంగా ఉండకపోవడం వంటి సాకులు చూపి చిట్టిబాబుకు సీటు లేకుండా చేయాలనుకుంటున్నారు. పార్టీపై వ్యతిరేకత ఉందని బహిరంగంగా చెప్పకున్నా పలు సందర్భాల్లో తాను పోటీకి దూరమంటూ బహిరంగసభల్లోనే ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఆయనను కాదని మరొకరికి ఇచ్చినా ఓట్లు దక్కే అవకాశంలేదని కార్యకర్తలంటున్నారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఈ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే కొత్తపేటలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంను కాదని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు కట్టబెట్టనున్నారనే ప్రచారం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం కలిగిస్తోంది. పార్టీని కాదని బయటకుపోయిన బండారు ఇప్పుడు అవసరం కొద్దీ వస్తున్నారని కార్యకర్తలు, స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక బలం వల్లనే బండారును మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని మండిపడుతున్నారు. అభ్యర్థి ఉంటే సరిపోతుందా, పార్టీ శ్రేణులు పనిచేయనక్కరలేదా? అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. రామచంద్రపురంలో సైతం సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కోసం ప్రయత్నాలు చేస్తుండటం దారుణమని, ఇక్కడ కూడా డబ్బే ప్రాతిపదిక అని ద్వితీయశ్రేణి నాయకులు మండిపడుతున్నారు.
రాజమండ్రి సిటీ కోసం మాజీ మంత్రి గోరంట్ల బుచ్చియ్యచౌదరి, గన్ని కృష్ణ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇపుడు మరో నాయకుడు తెరమీదకు వచ్చారు. ప్రవాసభారతీయుడు, రూ.కోట్ల ఖర్చుకైనా సిద్ధమంటున్న సుంకవల్లి సూర్య పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. రాజమండ్రి సిటీలో ఇటీవల సూర్య ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ ఆశీస్సులతో సూర్యకు సీటు వస్తుందనే ధీమాను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీ ఆవిర్భావం నుంచి చమటోడుస్తున్నారు. అయితే ఆయనను కాదని మాజీ ఎమ్మెల్యే దివంగత నీతిపూడి గణపతిరావు తనయుడు లెనిన్‌బాబును పరిశీలనలోకి తీసుకోవడంపై నేతలు గుర్రుగా ఉన్నారు.
కేవలం ఆర్థిక కారణాలతో పులపర్తిని పక్కనపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం పేరు ఇంతవరకూ వినిపించగా, తాజాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేరు సీన్‌లోకి వచ్చింది. దీంతో విశ్వం వర్గీయులు రగిలిపోతున్నారు. కాకినాడ రూరల్‌లో వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆర్థిక పరిపుష్టి దృష్ట్యానే కన్నబాబు పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తదితరులు ఆర్థిక వ్యవహారాల్లో చక్రం తిప్పుతూ పార్టీకి చిత్తశుద్ధితో సేవ చేసినవారిని పక్కనపెడుతున్నారని కార్యకర్తలు నిరసిస్తున్నారు.
Advertisement