బడుగులకు అధికారంతోనే తెలంగాణ అభివృద్ధి: విమలక్క
‘మీట్ ది ప్రెస్’లో విమలక్క
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాలకు అధికారం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 15న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగే ప్రథమ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి నవ తెలంగాణకోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, కబ్జాదారులు ఆక్రమించుకున్న స్థలాలను దళితులకు అందించాల్సిన అవసరముందన్నారు. మైనారిటీ ప్రజలకు భద్రత కల్పిస్తూ వక్ఫ్ భూములను వారికి కేటాయించాలని కోరారు.
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు సీమాంధ్ర ప్రజల్లో అభద్రత భావాలను, అనుమానాలను రేకెత్తిస్తూ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ బిడ్డల రక్తమాం సాలతో నిర్మితమైందని, దానిపై సీమాంధ్రులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు శాంతిర్యాలీలు చేస్తామంటే అనుమతించని ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై యుద్ధానికి సిద్ధమైన సీమాంధ్ర ఉద్యోగులకు అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ.. నవ తెలంగాణకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. టీజేయూ నాయకులు శ్రీనివాసరావు, ఇస్మాయిల్, వెంకట్, మోహన్ బైరాగి, సుదర్శన్, అరుణ తదితరులు పాల్గొన్నారు.