నిడమర్రు: 2017–18 ఈనెల 15 నుంచి 29 వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాలో 239 పరీక్ష కేంద్రాల్లో 50,423 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా కారణం చేత / ఫీజు చెల్లించలేదని సంబంధిత పాఠశాల నుంచి హాల్ టికెట్లు పొందలేని విద్యార్థులు వారి హాల్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. హాల్ టికెట్స్ ఏవిధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు తదితర సమాచారం తెలుసుకుందాం.
డౌన్‌లోడ్ ఇలా..
♦ www.bre.ap.orf అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్ ముఖ చిత్రంలో ఎడమవైపు ‘క్విక్ లింక్స్’ అనే కాలంలో ఎస్‌ఎస్‌సీ మార్చి– 2018 హాల్‌టికెట్స్ క్లిక్ చెయ్యాలి. తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ రెగ్యులర్/ ప్రైవేట్/ ఓరియంటల్/ ఒకేషనల్ హాల్ టికెట్స్ అని నాలుగు కాలమ్స్ కనిపిస్తాయి. అక్కడ సంబంధిత కాలమ్ వద్ద క్లిక్ చెయ్యాలి.
♦ మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ జిల్లా, స్కూల్, నేమ్ ఎంటర్ చెయ్యాలి. వివరాలు నమోదు చేశాక డౌన్‌లోడ్ హాల్ టికెట్ వద్ద క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్‌లోడు అవుతుంది.
♦ జిల్లాలోని అన్ని స్కూల్స్, వాటి కోడ్స్, పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల లిస్ట్ ఈ లింక్ వద్ద పొందుపర్చి ఉంటాయి. దీంతో వివరాలు నమోదు చెయ్యడం చాలా సులభం.
♦ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్‌పై ఆయా పాఠశాల హెచ్‌ఎం సంతకం, పాఠశాల ముద్ర తప్పనిసరి.
విద్యార్థులకు సూచనలు
♦ హాల్ టికెట్స్‌లో సూచించిన విధంగా ఆయా తేదీ / సబ్జెక్ / పేపర్ ప్రకారం పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలి.
♦ హాల్ టికెట్‌లో పొందుపరిచిన పరీక్షా కేంద్రాన్ని విద్యార్థి ఒకరోజు ముందుగా సందర్శించి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటే మంచింది.
♦ మీరు ప్రతి రోజు మీఇల్లు / స్కూల్ నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం, పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది. రవాణా సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి తదితర విషయాలు ముందుగా అంచనా వేసుకోవడం ఉత్తమం.
♦ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతిస్తారు. అనంతరం ఓఎంఆర్ షీట్, ఆన్‌షీట్ అందిస్తారు. ఈ రెండిటినీ కలిపి ఇన్విజిలేటర్ సూచనల ప్రకారం పిన్ చెయ్యాలి.
♦ 9.30 గంటలకు విద్యార్థులకు ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రం అందిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు తీసుకుంటారు. పరీక్ష రాసేం దుకు 2.45 గంటల సమయం ఉంటుంది. ప్రశ్నాపత్రాలు సీసీఈ మాదిరిలో ఉండటంతో ఈ 2.45 గంటల సమయంలో, మొదటి 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదువుకుని అవగాహన చేసుకునేందుకు కేటాయించారు.
♦ ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలు, ఓఎంఆర్ షీటు వెసుక భాగంలో ఉన్న సూచనలు ఒకసారి చదువుకోవాలి
♦ ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైన కూడా హాల్ టికెట్ నంబర్, పేరు ఎట్టిపరిస్థితిల్లోనూ రాయకూడదు.
♦ ఓఎంఆర్ షీటు ఏదైనా కారణం చేత పాడైతే, వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకు వెళ్లాలి. అప్పుడు సిబ్బంది నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ అందిస్తారు.
♦ ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం, నలపడం లాంటి చర్యలు చేయకూడదు.
♦ విద్యార్థి చూచిరాతకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఆ విద్యార్థిపై జీఓ 872 ప్రకారం తరువాత జరిగే పరీక్షలు రాసేందుకు వీలుండదు. అలాగే శాఖాపరమైన చర్యలు ఆవిద్యార్థిపై తీసుకుంటారు.
♦ భవిష్యత్తులో విద్యా / ఉద్యోగ అవసరాల దృష్ట్యా పరీక్షలు అనంతరం కూడా హాల్ టికెట్స్ జాగ్రత్త పరుచుకోవాలి.
♦ పాఠశాల నుంచి అందిన / ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్స్‌లో ఏమైనా లోపాలు కనిపిస్తే తక్షణం సంబంధిత హెచ్‌ఎం/పరీక్ష కేంద్రం పర్యవేక్షకుని దృష్టికి తీసుకువెళ్లాలి.
♦ అన్ని పరీక్షలకు పార్ట్–బి (బిట్ పేపర్) పరీక్ష చివరి అరగంట ముందుగా ఇస్తారు. అయితే మిగిలిన తెలుగు, ఇంగ్లిషు పేపర్లకు పార్టీ–ఎ తోపాటే పార్ట్–బి ముందుగానే ఇస్తారు. విద్యార్థులు గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment