పాములు.. పశువులకే ఆవాసం
పిచ్చిమొక్కలు.. రొచ్చుదొడ్లు
ప్రభుత్వాసుపత్రుల్లో స్వచ్ఛభారత్ తీరు
స్వచ్ఛభారత్.. ప్రధాని మోదీ ఎంతో ఘనంగా ప్రారంభించిన పథకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంతో గొప్పగా దీనిని తలకెత్తుకున్నారు.. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ఎంతో శుభ్రత పాటించాల్సిన ఆసుపత్రులు కనీసమైన ప్రమాణా లక కూడా నోచుకోవడం లేదు. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తిలేని వ్యాధిగ్రస్తులు సాంత్వన పొందాల్సిన ఆసుపత్రులు తుప్పలకు, డొంకలకు నిలయాలుగా మారాయి. ఎలుకలు, పాములు అక్కడ విలయతాండవం చేస్తున్నాయి. పారిశుధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విశాఖపట్నం: రోగులుండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాములు, పశువులు తిష్ట వేస్తున్నాయి. రోగుల పక్కల (బెడ్ల) పై కుక్కలు పడకేస్తున్నాయి. ఈ ఆసుపత్రుల ఆవరణలు అడవులను తలపించేలా పిచ్చిమొక్కలతో బలిసి ఉంటున్నాయి. చాలా చోట్ల ప్రహరీ గోడలు కూడా లేకపోవడంతో మేత కోసం పశువులు చొరబడుతున్నాయి. దట్టంగా ఉండడంతో విషసర్పాలు, కీటకాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఏడాదికోసారి కూడా తుప్పలను తొలగించడం లేదు. ప్రభుత్వం స్వచ్ఛభారత్ అంటూ చేసే హడావుడి ఒకట్రెండు రోజులకే పరిమితమవుతోంది. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛ భారత్ అపహాస్యమవుతోంది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి. రోజుల తరబడి పేరుకుపోయిన చెత్త, చెదారాలను తొలగించడం లేదు. చాలాచోట్ల నీటి సదుపాయం కూడా లేదు. అక్కడక్కడ మంచినీటి సదుపాయం ఉన్నా అక్కడ అపారిశుధ్యంతో తాగే పరిస్థితి లేదు. నీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయాలన్న ధ్యాసే ఉండడం లేదు. పేద రోగులు దిక్కులేని పరిస్థితుల్లో ముక్కుమూసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాగుపడాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పే ప్రభుత్వమే సాక్షాత్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వాటి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 85 పీహెచ్‌సీలు, 13 సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆస్పత్రి, 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు 35 ఉన్నాయి. వీటిలో మూడొంతులకు పైగా ప్రభుత్వాసుపత్రులు పిచ్చిమొక్కలతో ‘కళకళలాడుతున్నాయి’. వాటిలో పాములు, విష పురుగులు ఆవాసాలేర్పరచుకుంటున్నాయి. ఆసుపత్రుల్లోని రోగులుండే గదుల్లోకి చొరబడి భయకంపితులను చేస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులపై సాక్షి బృందం విజిట్‌లో వెలుగు చూసినవి కొన్ని..
► ఈనెల 27న ఆదివారం సబ్బవరం పీహెచ్‌సీ ప్రసూతి వార్డులోకి భారీ పొడపాము ప్రవేశించింది. అక్కడ ఉన్న పిల్లిని కాటేసింది. అదృష్టవశాత్తూ వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్టయింది. స్థానికులు ఆ పామును చంపేశారు. ఈ పీహెచ్‌సీలో పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి.
►ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్‌సీ పరిసరాల్లోనూ తుప్పలు పెరిగిపోయాయి. తరచూ అక్కడ పాములు సంచరిస్తున్నాయి. పైగా ఈ భవనం శిథిలస్థితికి చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది.
► చోడవరం ఆస్పత్రి చెత్తకుప్పలు, నిర్వహణ లేని మరుగుదొడ్లు దుర్గంధం వెద జల్లుతున్నాయి. మరుగుదొడ్లలోనే రక్తపు గుడ్డలు, దూది వంటివి వేస్తున్నారు. పిచ్చి మొక్కలూ బలిసిపోయి పాములకు ఆవాసంగా మారడంతో అవి వార్డుల్లోకి తరచూ వస్తున్నాయి. దీంతో అక్కడ సిబ్బంది, రోగులు బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు.
►రావికమతం పీహెచ్‌సీలో తుప్పలు, డొంకలు పెరిగిపోయి ఉన్నాయి. అక్కడ కూడా పాములు సంచరిస్తున్నాయి. రోగులు, వారి బంధువులను భయకంపితులను చేస్తున్నాయి.
►పెందుర్తి పీహెచ్‌సీలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుధ్య పనివారికి జీతాలు చెల్లించక నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో రోగులు ముక్కుమూసుకుని వైద్యం చేయించుకుంటున్నారు.
►భీమిలి మండలం రేవిడి పీహెచ్‌సీలో హుద్‌హుద్ తుపానుకు కూలిన చెట్లను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ఆస్పత్రిలో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
►భీమిలి పీహెచ్‌సీలో పిచ్చిమొక్కలు పెరిగి పశువులు, కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
►నక్కపల్లి, నాతవరం ఆసుపత్రుల్లో స్వచ్ఛభారత్ మచ్చుకైనా కానరావడం లేదు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది.
►నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో స్వచ్ఛభారత్ మూన్నాళ్ల ముచ్చటే అ యింది. పారిశుధ్య నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేరు. ఆస్పత్రి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతోంది. పిచ్చిమొక్కలు అడవుల్లా పెరిగి పాములు, విష కీటకాలకు ఆవాసాలుగా మారాయి.