నేడు సీఎం రాక
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. చిత్తూరు నగరంలో జరగనున్న రైతు సాధికారత సదస్సుకు హాజరు కానున్నట్లు కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఉదయం 8:40 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 9:40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి 9:45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10:45 గంటలకు చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55 గంటలకు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం 11.30 నుంచి 1.30 గంటల వరకు పీవీకేఎన్ కళాశాలలో రైతు సాధికారత సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు మెసానికల్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి బయలుదేరి మూడు గంటలకు తిరుపతి గ్రాండ్‌రిడ్జ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు అర్బన్ హాట్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 6:15 గంటలకు అర్బన్ హాట్ నుంచి బయలుదేరి 6:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేకవిమానంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.
సభకు భారీ బందోబస్తు
సీఎం పాల్గొనే రైతుసాధికారిత సదస్సు సభా ప్రాంగణం వద్ద ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, వంద మంది కానిస్టేబుళ్లతోపాటు ప్రత్యేక దళాలు, ఏఆర్ పోలీసులను బందోబస్తు నియమించాని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.