రవాణాశాఖలో ‘ఫోర్జరీ’ కలకలం
నెల్లూరు (టౌన్) : రవాణాశాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. సిబ్బంది చేతులు తడిపితే చాలు ఒరిజనల్ ధ్రువపత్రాలు లేకపోయినా పని క్షణాల్లో అయిపోతుంది. ఏజెంట్లను ఆశ్రయిస్తే క్షణాల్లో పనిచేసి చేతిలో కాగితాన్ని పెడతారు. ఇందుకు కావాల్సిన సరంజామా అంతా వారి దగ్గర రెడీగా ఉంటుంది. ఇదంతా రవాణా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. తాజా గా ఆర్టీఓ సంతకం ఫోర్జరీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి బ్యాడ్జీ కోసం దరఖాస్తు చేయగా పత్రాల్లో ఆర్టీఓ సంతకాన్ని ఓ ఏజెంట్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం సంబంధిత పత్రాలను పరిశీలించి ఫోర్జరీ జరిగిందని నిర్ధారించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు.
ఇది జరిగిందీ...
రవాణా వాహనం నడిపేందుకు హెవీ లెసైన్స్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. ఇది కావాలంటే బ్యాడ్జీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాడ్జి పొందాలంటే 8వ తరగతి ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్‌ను ఇవ్వాలి. ఓ ఏజెంట్ సదరు సర్టిఫికెట్‌తో పాటు దరఖాస్తు, రూ.90లు చలానాను ఎల్‌ఎల్‌ఆర్ సెక్షన్‌లో ఇచ్చాడు. అయితే ఆర్టీఓ సంతకం దరఖాస్తులో ఉండగా, రిజిస్టర్‌లో లేకపోవడంపై ఆ సెక్షన్ ఉద్యోగికి అనుమానం రావడంతో వెంటనే ఆర్టీఓను సంప్రదించారు. ఫైల్‌ను పరిశీలించిన ఆర్టీఓ తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇంత పెద్ద విషయం జరిగినా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయంశమైంది.
ఏజెంట్లు చేతికి కార్యాలయ ఫైళ్లు
రవాణాశాఖలో కొందరు ఏజెంట్లు కార్యాలయ ఫైళ్లను తమవద్ద ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా సంఘటనతో ఈ వ్యవహారం బయట పడింది. ఏజెంట్ 8వ తరగతి సర్టిఫికెట్ నకిలీదనే విషయం తెలిసిపోతుందని ఏకంగాకార్యాలయ ఫైల్‌ను తీసుకుని ఆర్టీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగికి ఇచ్చా డు. దొంగ సర్టిఫికెట్‌ను పట్టించుకోకుం డా లెసైన్స్ జారీ చేసేందుకు రూ.10 నుం చి రూ.15వేలు లంచంగా ముట్టజెప్పుతారని ఆరోపణలున్నాయి. 2011 జనవరి లో ఇదే ఏజెంట్ అప్పటి ఆర్టీఓ రాంప్రసా ద్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నకిలీ సర్టిఫికెట్లను పెట్టి సుమారు 50కి పైగా లెసైన్సులు ఇప్పించినట్లు సమాచారం. ఏసీబీ కార్యాలయంలో పనిచేసే ఓ కాని స్టేబుల్ సదరు ఏజెంట్‌కు అండదండలు అందిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
ఏసీబీ పేరుతో బెదిరింపులు
రవాణాశాఖ కార్యాలయంలో జరిగే అక్రమాలన్నీ ఏజెంట్లు తెలుస్తుండటంతో అధికారులు వీరిని ఏమీ అనలేకపోతున్నారు. మేం చెప్పినట్లు వినకపోతే ఏసీబీకి పట్టిస్తామని గతంలో ఏజెంట్లు అధికారులను బెదిరించారని తెలిసింది. ఏసీబీ రవాణాశాఖ కార్యకలాపాలపై దృష్టిసారించకపోవడంతో అక్రమాలకు అంతేలేకుండా పోతుంది.
ఫోర్జరీ జరిగింది వాస్తవమే:
ఆర్టీఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. ఆర్టీఓ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఆయన నా దృష్టికి తీసుకొస్తే ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.
- శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్