♦ నేటి నుంచి నీటి సంఘాల ఎన్నికలు
♦ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా ఆరుగురితో కార్యవర్గం
సాక్షి, కర్నూలు : జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికకు తెరలేచింది. నేటి నుంచి నుంచి సంఘాల ఎంపిక ప్రక్రియ షూరు కానుంది. కార్యవర్గాలను ‘ఏకాభిప్రాయం’తో నే ఎన్నుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నామినేషన్లు.. పోలింగు హడావుడి ఏమాత్రం ఉండకుండా సభకు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరి అనుకూలంగా చేతులెత్తితే వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అధికారులకు ఈ ఎన్నిక కత్తి మీద సాముగా మారింది. ముందుగా నీటి సంఘాల ఎన్నిక 18వ తేదీ కల్లా పూర్తికావాలి. 19వ తేదీన డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు, 25 నాటికి ప్రాజెక్టు కమిటీల ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆయకట్టు రైతు ఐతే చాలు..
ఆయకట్టు రైతులు అందరూ సమావేశంలో పాల్గొనవచ్చు. మినిట్స్‌లో వారందరి సంతకాలు తీసుకుంటారు. ముందుగా అధికారులు నిబంధనలు చదివి వినిపిస్తారు. ఒక్కో సంఘానికి ఆరుగురు సభ్యులను ఎంపిక చేసుకోవాలి. వారిలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సమావేశానికి హాజరైన సభ్యులకు అధికారులు ఇదే విషయాన్ని వివరిస్తారు. సమావేశంలో రెండు లేదా మూడు అభిప్రాయాలు వెల్లడి కావచ్చు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని లెక్కలోనికి తీసుకుని.. దాన్నే ఏకాభిప్రాయంగా పరిగణిస్తారు.
గట్టి పోలీసు బందోబస్తు..
జిల్లాలో మొత్తం 323 సాగునీటి సంఘాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ సంఘాలకు ఎన్నికలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం రైతుల ఏకాభిప్రాయంతోనే ఈ సంఘాలను ఎన్నిక చేయాలని ఆదేశించింది. ఈ పదవులకు స్థానికంగా పోటాపోటీ ఉంటుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు అదే భావించి పోలీసు బందోబస్తును కోరారు. సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎంత మంది హాజరైనా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఎక్కువ మంది హాజరైతే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. ఆయకట్టు పనుల్లో కార్యవర్గాలకే ప్రాధాన్యం ఉంటుంది కనుక ఆయకట్టు రైతులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఎవరికి వారు పదవులు కావాలని పట్టుబడితే మాత్రం నిర్వాహకులకు ఇబ్బంది తప్పదు.
ఏకగ్రీవం సాధ్యమేనా!
Published Mon, Sep 7 2015 3:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement