సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసినపుడు కోరారని, దానికి స్పందనగానే రూ.55,548కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇది తన తండ్రి చంద్రబాబు కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టుకోవటం ఆపాలంటూ మండిపడ్డారు. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీదంటూ ధ్వజమెత్తారు.
ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ‘‘రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేయాల్సింది పోయి.. కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉందన్నారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే ప్రజలు వాతలు పెట్టి టీడీపీ నేతలను తరిమేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment