ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
- చంద్రబాబు హామీలు నెరవేర్చాలి
- ఎన్‌డీఏ, టీడీపీలపై పోరాటం
- వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు
పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నష్టాలు వచ్చినా ప్రజల పక్షానే ఉంటామని తేల్చి చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష పాత్రలో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే దిశగా ముందుకు పోతామన్నారు.
చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో.. మోడి గాలితో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పిన హామిలను నెరవేర్చకపోతే వెంటాడుతూ.. అమలుపరిచే విధంగా ముందుకెళతామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అప్పుడే వైఎస్సార్ సీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరు ఎన్ని భయాలకు గురి చేసినా తలొగ్గే ప్రసక్తే లేదని, చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయకపోతే పదవి నుంచి కిందికి దింపుతామని చెప్పారు.
ఇంటికో ఉద్యోగం, పంట రుణాల మాఫీ చేయడం లాంటివి వెనక్కి తగ్గితే ఉద్యమిస్తామని తెలిపారు. ప్రతిపక్షమంటే ఇలాగుండాలనేలా ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. జూన్ 2, 3వ తేదీల్లో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసి గెలుపోటములపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పార్టీ ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు.
ఎంపీటీసీ, సర్పంచి, మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చిన సార్వత్రిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీకి భారీగా ఓట్ల శాతం పెరిగిందని, దీంతో గ్రామీణ స్థాయిలోనూ వైఎస్సార్ సీపీకి క్యాడర్ బలంగా ఉందన్న విషయం స్పష్టమైందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. గతంలో 20మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా.. ఎన్నో ఉద్యమాలు చేశామని, రానున్న 5ఏళ్లల్లో ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలిపారు.
ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం జగన్ అన్నది అక్షర సత్యమని స్పష్టం చేశారు. బుధవారం ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్ష నేత వైఎస్ జగన్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఇడుపులపాయలో విలేకరులతో మాట్లాడారు.
కేసుల కోసం మోడీని కలవలేదు
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. టీడీపీ నాయకులు కొంతమంది నరేంద్ర మోడిని జగన్ కేసులు మాఫీ చేసుకునేందుకు కలిశారనడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడేందుకు నరేంద్రమోడి దృష్టికి సమస్యలు తెలియజెప్పేందుకే జగన్ ఆయనను కలిశారు. కానీ కేసుల కోసం రాజీ పడి ఉంటే సోనియా గాంధీతో రాజీపడి ఉండేవారు... ఇప్పుడు ఆ సమస్య ఎందుకు వస్తుంది. ఇప్పటికే టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. కార్యకర్తలకు అండగా ఉంటాం.
- మాజీ మంత్రి పార్థసారథి
కార్యకర్తలకు అండగా ఉంటాం
కార్యకర్తలకు అండగా ఉంటాం. అధికారం లేకపోయినా ప్రజల వెంటే ఉండి కార్యకర్తలను కాపాడుకుంటాం. మోసపూరిత విధానాలకు ప్రజలు కొంతమంది మొగ్గుచూపారు.. కానీ చంద్రబాబు కపట నాటకాలు త్వరలో బయటపడతాయి. జగన్ లాంటి నాయకులు కావాలని ప్రజలు కోరుకునే రోజు త్వరలోనే వస్తుంది.
- ఉప్పులేటి కల్పన, పామర్రు ఎమ్మెల్యే