మీ ఆడ బిడ్డలా అభ్యర్థిస్తున్నా.. | YS Vijayamma Janapadam Road Show at Anantapur | Sakshi
Sakshi News home page

మీ ఆడ బిడ్డలా అభ్యర్థిస్తున్నా..

Published Tue, Mar 18 2014 2:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మీ ఆడ బిడ్డలా అభ్యర్థిస్తున్నా.. - Sakshi

మీ ఆడ బిడ్డలా అభ్యర్థిస్తున్నా..

సాక్షి, అనంతపురం : ‘అనంతపురం జిల్లా అభివృద్ధికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంకా జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తపనపడుతున్నారు. ఆ అవకాశం నా బిడ్డ జగన్‌మోహన్‌రెడ్డికి కల్పించాలి. మునిసిపల్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని మీ ఆడబిడ్డలా కోరుతున్నా’ అనివైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అనంతపురం ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చేపట్టిన ‘జనపథం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురంలో వైఎస్ విజయమ్మ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లోని నగరపాలక కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
 
 ‘జిల్లాలో ఎంతో మందికి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. మరికొంత మందిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. అయితే వారిలో ఎవరికి మా కుటుంబం మీద కనీసం మాత్రం కూడా అభిమానం లేదు. అది మాకు బాధగా లేదు. ఎందుకంటే ఇన్ని వేల మంది గుండెల్లో మాకు చోటు ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను జిల్లాకువచ్చిన ప్రతి సారి ఇదే అభిమానాన్ని, ఆప్యాయతను చూపిస్తున్న మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను’ అని విజయమ్మ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అనంతపురం జిల్లాకు హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరు అందించేందుకు మహానేత చేసిన కృషి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార వాంఛతో చంద్రబాబు అమలు కానీ హామీలు ఇస్తున్నాడు. బాబూ ప్రలోభాలను ఎవరూ నమ్మకండి.. 
 
 విశ్వనీయతకు మారుపేరైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జిల్లా, నగర అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. అసెంబ్లీలో కిరణ్ సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడే చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే బంగారంలాంటి రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరించిన చంద్రబాబు నేడు ఏమీ తెలియని అమాయకునిలా వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. సెమీఫైనల్‌లాంటి ఈ ఎన్నికల్లోనే ఆల్‌ఫ్రీ బాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. సభలో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, సీఈసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement