రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వండి
రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రుణాల రీ షెడ్యూల్ సాధ్యంకాదని రిజర్వు బ్యాంకు గవర్నర్ తేల్చిచెప్పారని, ఈ నేపథ్యంలో రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులంతా తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారని తెలిపారు.
మరోవైపు.. లెవీపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతు లోకానికి గొడ్డలిపెట్టులా ఉంటుందన్నారు. ఈ నిర్ణయంతో రైతుల భవిష్యత్తును మిల్లర్లు, వ్యాపారస్తుల చేతిలోకి నెట్టేశారని ఆయన తెలిపారు. లెవీని 75 నుంచి 25 శాతానికి కుదించడం అత్యంత దారుణమని ఉమ్మారెడ్డి అభివర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరు ప్రభుత్వాలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు.