ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : ప్రజలను ఓట్లు అడిగే అర్హత ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం 7, 8, 9, 10 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి రాష్ట్ర ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారన్నారు. అయితే వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పెద్దలు ఆ విజయాన్ని పార్టీ విజయంగా చెప్పుకున్నారన్నారు.
ప్రజలకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పాపం మూటగట్టుకుందని నాని విమర్శించారు. టీడీపీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతుగా లేఖ ఇవ్వడమే కాకుండా పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజాభిప్రాయంతో పనిలేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, దానికి సహకరించిన తెలుగుదేశం పార్టీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు వేయమని ప్రజలను అడగడానికి వస్తున్నారని నాని ప్రశ్నించారు.
ముందు నుంచి రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తమ పార్టీ విశ్వప్రయత్నం చేసిందన్నారు. 7, 8, 9, 10 డివిజ న్‌లలో పోటీ చేస్తున్న కొల్లిపర లక్ష్మి, రొయ్యూరు లక్ష్మి, డి.అనిల్ కుమార్, దేవరకొండ నాగేశ్వరరావులను కార్పొరేటర్లుగా గెలిపించాలని నాని ప్రజలను కోరారు. ఆయన వెంట టీఎన్ స్వామి, బొద్దాని శ్రీనివాస్, పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, మోర్త రంగారావు, కొల్లిపర భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
ఓట్లు అడిగే హక్కు వైసీపీకే ఉంది
Published Sat, Mar 22 2014 12:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement