అపోలో మెగా హెల్త్ పార్కుకు లైన్ క్లియర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ చిత్తూరు జిల్లా మోర్కంబత్తూరులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్రతిపాదిత మెగా హెల్త్ పార్కుకు మార్గం సుగమం అయింది. పార్కు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదం కాస్తా పరిష్కారం అయింది. 86 ఎకరాల్లో హెల్త్ పార్కును అందుబాటులోకి తేనున్నట్టు దాదాపు మూడేళ్ల క్రితం సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థల వివాదం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని, వారం క్రితమే సమస్య పరిష్కారం అయిందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఆపరేషన్స్) సంగీతారెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారం తెలిపారు. నిర్మాణ పనులను చకచకా ప్రారంభిస్తామని చెప్పారు. విశేషమేమంటే అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చిత్తూరు జిల్లా వాసి కావడం.
రెండేళ్లలో రెడీ..
ప్రతిపాదిత మెగా హెల్త్ పార్క్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని సంగీతారెడ్డి పేర్కొన్నారు. సలహా సేవలు అందించే ప్రముఖ కంపెనీ కేపీఎంజీ సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘పార్కులో 200 పడకలతో అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత వైద్య కళాశాలకు దరఖాస్తు చేస్తాం. వైద్య రంగానికి అవసరమైన శిక్షణ కేంద్రాలన్నీ ఇక్కడ అందుబాటులోకి తేనున్నాం. నర్సింగ్, సహాయకులు, నిర్వాహకులు, సాంకేతిక, పరీక్షా కేంద్రాల సిబ్బంది, వైద్యులు.. ఇలా అన్ని విభాగాలకు కావాల్సిన మానవ వనరులను తయారు చేస్తాం’ అని వివరించారు. సిబ్బంది నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
35 కంపెనీలతో..
సిరంజిలు, శస్త్ర చికిత్సకు వాడే పనిముట్లు, పడకలు, ట్రాలీ, స్ట్రెచెస్, ఇతర వైద్య ఉపకరణాల తయారీ కంపెనీలు పార్కులో అడుగు పెట్టనున్నాయి. 15 దాకా భారీ, మధ్య తరహా కంపెనీలు రానున్నాయి. వీటితోపాటు మరో 20 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఈ కంపెనీల్లో తయారైన ఉత్పత్తులను అపోలో ఆసుపత్రులకు వినియోగిస్తారు. అలాగే కొన్ని రకాల ఉత్పత్తులను అపోలో ఫార్మసీలకు సరఫరా చేస్తారు. అపోలో హాస్పిటల్స్ ఈ పార్కులో ఏర్పాటు చేసే ఆసుపత్రిలో ఒక్కో పడకకు రూ.40-60 లక్షలు వ్యయం అవుతుంది. సంస్థకు భారత్‌తోసహా వివిధ దేశాల్లో 61 ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తం పడకల సంఖ్య 10 వేలపైనే.