ట్రాయ్ ప్రతిపాదనల మేరకే వీఎన్ఓ గైడ్ లైన్లు
న్యూఢిల్లీ : వర్చువల్ నెట్ వర్క్ ఆపరేటర్లకు(వీఎన్ఓ) కేంద్ర ప్రభుత్వం లైసెన్సు గైడ్ లైన్లను విడుదల చేసింది. ట్రాయ్ ప్రతిపాదనల మేరకు ఈ గైడ్ లైన్లను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. యునిఫైడ్ లైసెన్సులను వీఎన్ఓ( యూఎల్ వీఎన్ఓ)లకు జారీచేస్తున్నట్టు టెలికాం డిపార్ట్ మెంట్ తెలిపింది. వీఎన్ఓ లను విస్తరించుకునే టెలికాం సర్వీసు ప్రొవైడర్లగా టెలికాం గుర్తించింది. మొబైల్ ల్యాండ్ లైన్, ఇంటర్నెట్ వంటి టెలికాం సర్వీసులు అందించవచ్చని ఈ గైడ్ లైన్లలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, ఎయిర్ టెల్ వంటి కంపెనీలే పూర్తిస్థాయి టెలికాం ఆపరేటర్లుగా కొనసాగుతాయని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు దగ్గరున్న వినియోగింపబడని మౌలిక సదుపాయాలను వీఎన్ఓలు వాడుకోవచ్చని వెల్లడించింది.
వేరే ఎన్ఎస్ఓ నెట్ వర్క్ లతో అనుసంధానించుకుని ఈక్విప్ మెంట్లను ఇన్ స్టాల్ చేసుకునే సౌకర్యాన్ని మాత్రం వీఎన్ఓలకు అనుమతించమని టెలికాం తేల్చి చెప్పేసింది. వీఎన్ఓ లు కచ్చితంగా తమ సర్వీసులు అందించే సొంత ప్లాట్ ఫామ్ లు కలిగి ఉండాలని, బిల్లింగ్, వాల్యు యాడడ్ సర్వీసుల వంటి కస్టమర్ సర్వీసులను సొంతంగా అందించాలని పేర్కొంది. వీఎన్ఓల ఎంట్రీ ఫీజు కింద గరిష్టంగా రూ.7.5 కోట్ల నిర్ణయించినట్టు గైడ్ లైన్లలో టెలికాం పేర్కొంది.