ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌ను నిర్మించండి
⇒ భారతీయ రైల్వేల్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి...
⇒ ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావోకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేల్లో పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రైల్వేను పూర్తిస్థాయిలో మలుపుతిప్పేవిధంగా ఈ రంగంలో ఒక ప్రాజెక్టును పూర్తిచేయాలని, అందరినీ అబ్బురపరిచే స్థాయిలో దీనికి రూపకల్పన చేయాల్సిందిగా ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావోకు మోదీ విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ తనను కలిసిన నకావోతో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
ఏదైనా ఒక రైల్వే స్టేషన్‌ను ఎంచుకొని దాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయాలని... దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ప్రాజెక్టులను రైల్వే శాఖ చేపడుతుందని మోదీ సూచించినట్లు పీఎంవో తెలిపింది. కాగా, గతేడాది ఏడీబీ భారత్‌కు 1.4 బిలియన్ డాలర్లమేర రుణాలను(2013తో పోలిస్తే 40 శాతం అధికం) మంజూరు చేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక నాకావో భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా, భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడుల పెంపుతో పాటు మెరగైన వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు మోదీ సర్కారు చేపడుతున్న చర్యలను నకావో ప్రశంసించినట్లు ఏడీబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోనుందని ఆయన చెప్పారని పేర్కొంది.
మోదీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా నకావో సమావేశమయ్యారు. ఆర్థికాభివృద్ధిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో ఏడీబీ భాగస్వామ్యంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇంధన సబ్సిడీల తగ్గింపు, పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు, మౌలిక రంగ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించడం వంటి తాజా సంస్కరణ చర్యలను నకావో వద్ద జైట్లీ ప్రధానంగా ప్రస్తావించారు. వృద్ధికి చేదోడుగా నిలవనున్న వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నకావో కొనియాడారు.
స్మార్ట్ సిటీలకు చేయూతనిస్తాం...
భారత్‌లో 100 స్మార్ట్ సిటీలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రణాళికలకు తోడ్పాటునందిస్తామని ఏడీబీ ప్రెసిడెంట్ నాకావో హామీనిచ్చారు. సరైన పారిశుద్ధ్యం, చౌక రవాణా సదుపాయాలతోపాటు టెక్నాలజీ, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ సద్వినియోగంతో నగరాల్లోని పేదలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. గురువారమిక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.