ఎస్‌బీఐతో సెన్సెక్స్ జోరు
⇒ 29,000 మార్క్ దాటిన సెన్సెక్స్
⇒ 8,800 దాటేసిన నిఫ్టీ
⇒ సెన్సెక్స్ లాభం 290 పాయింట్లు
మార్కెట్ అప్‌డేట్
ముంబై: వృద్ధికి దోహదపడేలా బడ్జెట్ ఉండగలదన్న అంచనాలకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే బావుండడం కూడా కలసి వచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 29,000 మార్క్‌ను, నిఫ్టీ 8,800 మార్క్‌ను దాటాయి. స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజూ లాభాల్లోనే ఉన్నాయి. మొత్తం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 868 పాయింట్లు లాభపడింది.
గత రెండు వారాలూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం మాత్రం లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, వాహన, లోహ రంగాల షేర్లు పెరిగాయి. ఎస్‌బీఐ నికర లాభం 30 శాతం వృద్ధి చెందడంతో ఈ షేర్ 8 శాతం పెరిగింది. సెన్సెక్స్ 290 పాయింట్ల పెరుగుదలలో ఎస్‌బీఐ వాటా 86 పాయింట్లు కావటం గమనార్హం. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. శుక్రవారం ఉదయం 28,889 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... ఒక దశలో 29,155 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది, చివరకు 290 పాయింట్లు లాభపడి 29,095 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8,806 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రభావం చూపిన అంశాలు...
ఎస్‌బీఐ, మహీంద్రా ఫలితాలు అంచనాలను మించడం, వినియోగదారుల ద్రవ్యల్బోణం గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉండడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 5.11 శాతానికి పెరిగింది. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం సమీపంలోనే ఉండటం, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి మందగమనంగా ఉండటంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ప్రభావం చూపాయి. గ్రీస్ బెయిలవుట్ అంశం కొలిక్కి వస్తుండడం, యూరో జోన్ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోందన్న ఆశలతో యూరోప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
కొన్ని షేర్లను పరిశీలిస్తే..
30 షేర్ల సెన్సెక్స్‌లో 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ 8%, మహీంద్రా అండ్ మహీంద్రా 5.1%, టీసీఎస్ 3%, కోల్ ఇండియా 2.3%, ఐటీసీ 2%, విప్రో 1.9%, సన్ ఫార్మా 1.7%, మారుతీ సుజుకీ 1.7%, హీరో మోటోకార్ప్ 1.5%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.3%, హెచ్‌డీఎఫ్‌సీ 1.1% చొప్పున వృద్ధి చెందాయి. గెయిల్ ఇండియా 3.9%, భెల్ 3.1%, ఓఎన్‌జీసీ 1.9%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతం చొప్పున తగ్గాయి. 1,456 షేర్లు పెరగ్గా, 1,429 షేర్లు తగ్గాయి.
టర్నోవరు... పెట్టుబడులు...
టర్నోవర్ బీఎస్‌ఈలో రూ. 4,038 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.21,000కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,39,170 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.390 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.96 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.