తొలుత +150 తుదకు -195
27,506 వద్ద ముగిసిన సెన్సెక్స్
రోజులో భారీ హెచ్చుతగ్గులు
గరిష్టం 27,850,కనిష్టం 27,475
మెటల్స్‌కు చైనా ఆందోళనల దెబ్బ
జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ర్ట ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి అనుకూలంగా వెలువడటంతో తొలుత స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు ఎగసి 27,851 వద్ద రోజులో గరిష్టాన్ని చేరింది. ఆపై చైనా స్టాక్ సూచీ ‘షాంఘై’ 3% పతనంకావడంతో మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్టోబర్‌తో పోలిస్తే చైనా వాణిజ్య లోటు 17.2 బిలియన్ డాలర్ల నుంచి 20.8 బిలియన్ డాలర్లకు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపింది.
దీనికితోడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆశించిన బిల్లులు ఆమోదం పొందకపోవడంతో దేశీయంగానూ సెంటిమెంట్ బలహీనపడింది. వెరసి ట్రేడింగ్ గడిచేకొద్దీ నష్టాలు పెరిగి సెన్సెక్స్ కనిష్టంగా 27,475ను తాకింది. చివరికి 195 పాయింట్ల నష్టంతో 27,506 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,000 పాయింట్లు పుంజుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు తెలిపారు.
నిఫ్టీ 57 పాయింట్లు డౌన్
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం ఒడిదుడుకుల మధ్య 57 పాయింట్లు నష్టపోయింది. 8,267 వద్ద స్థిరపడింది. చైనా మందగమన పరిస్థితులు మెటల్ షేర్లను దెబ్బకొట్టాయి. సెసాస్టెరిలైట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నాల్కో, హింద్ జింక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో 3-1.5% మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 2% పతనమైంది. ఇక బ్లూచిప్స్‌లో టాటా పవర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ, భెల్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, రిలయన్స్ 3-1% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ 3-1.5% మధ్య పురోగమించాయి.
నష్టపోయినవే అధికం
ట్రేడైన షేర్లలో 1,862 నష్టపోతే, 1,058 బలపడ్డాయి. కాగా, రుణ భారాన్ని తగ్గించుకునే బాటలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు వాటా విక్రయించేందుకు వీలుగా స్పెషల్ అల్లాయ్ స్టీల్ విభాగాన్ని విడదీసేందుకు నిర్ణయించడంతో ముకంద్ షేరు 11% ఎగసింది. జపనీస్ భాగస్వామ్య సంస్థ ఎఫ్‌సీసీ రికోలో ఉన్న 50% వాటాను ఎఫ్‌సీసీకి విక్రయించడంతో రికో ఆటో 8% పుంజుకుంది.