పట్నా: ఆర్టికల్ 370 రద్దు విభజన అనంతరం చాలా మంది రాజకీయ నాయకులు ఇక అందమైన కశ్మీరీ యువతులను వివాహం చేసుకోవచ్చు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు ఏమో కానీ ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు కశ్మీరీ యువతులు వేరే రాష్ట్రాల యువకులను వివాహం చేసుకుంటే.. వారికి ఉండే కొన్ని ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు. కానీ మోదీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో బిహార్‌కు చెందిన ఇద్దరు సోదరులు.. కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నారు. వారిద్దరు కూడా అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు ఆర్టికల్ 370 రద్దు తర్వాత వివాహం చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కశ్మీరీ యువతులను పెళ్లి చేసుకున్నందుకు ప్రస్తుతం ఈ సోదరులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ వివరాలు.. సుపాల్‌లోని రామ్‌విష్ణుపూర్ గ్రామానికి చెందిన పర్వేజ్, తవ్రేజ్‌లు ఇద్దరు సోదరులు. రాంబన్‌లో వడ్రంగి పని చేస్తున్న వీరు ఇద్దరు కశ్మీరీ యువతులను ప్రేమించారు. వీరిద్దరు కూడా అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ రెండు జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. అనంతరం పర్వేజ్, తవ్రేజ్‌లు తమ భార్యలను తీసుకుని స్వగ్రామానికి వచ్చారు. కానీ యువతుల తండ్రి మాత్రం పర్వేజ్ సోదరులు తన కుమార్తెలను కిడ్నాప్ చేశారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, బిహార్ అధికారుల సాయంతో పర్వేజ్ సోదరులను అరెస్ట్ చేశారు. అయితే నిందితులు మాత్రం యువతుల ఇష్టం మేరకే తాము వారిని వివాహం చేసుకున్నామని..ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment