![Car Accident In Ellareddy - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/20/car_0.jpg.webp?itok=_HFjzfYe)
సురేశ్(ఫైల్)
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం సదాశివనగర్ మండల కేంద్రం శివారు 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గాంధారి మండల కేంద్రానికి చెందిన సామల సురేశ్ కుమార్(32) కొంత కాలంగా కామారెడ్డిలోని కల్కీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామమైన గాంధారిలో పని ఉందని ఇంట్లో చెప్పి మిత్రుని కారు టీఎస్ 09ఈఎఫ్ 6093 తీసుకుని బయలుదేరాడు.
సదాశివనగర్ శివారుకు రాగానే రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయాడు. వేగంగా ఉన్న కారు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారు పూర్తిగా నుజ్జయింది. కారు డ్రైవ్ చేస్తున్న సురేశ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో కా మారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య నాగలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment