పెళ్లి పందిరి తీయకుండానే యువకుడి మృతి | Groom Dead In road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి పందిరి తీయకుండానే యువకుడి మృతి

Published Thu, Dec 21 2017 8:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Groom Dead In road accident - Sakshi

గంగాధరనెల్లూరు:  ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొత్త పెళ్లి కొడుకు ఆస్పత్రికిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన గంగాధర నెల్లూరు మండలం కొట్రకోన పంచాయతీలో జరిగింది. స్థానికుల కథనం మేరకు..  లక్ష్మిరెడ్డిపల్లికి చెందిన రామ్మూర్తి కుమారుడు లోకనాథం (27) ఎంఎస్సీ వరకు చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాకపోవడంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్‌ 30వ తేదీన తిరుపతికి చెందిన నదియాను పెళ్లి చేసుకున్నాడు. మరవళ్లు పూర్తయి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన సొంత పనుల నిమిత్తం బుల్లెట్‌లో గంగాధరనెల్లూరు బయలుదేరాడు.

పెద్దకాల్వ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో లోకనాథం కిందపడిపోయాడు. పడిన చోట రాయి ఉండడంతో  తలకు తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.  పెళ్లయిన 20 రోజులకే కొడుకు మృతిచెందడంతో లక్ష్మిరెడ్డిపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. కాళ్లపారాణి కూడా ఆరకుండానే, అచ్చటా ముచ్చటా తీరకుండానే భర్త మృతిచెందడంతో ఆ యువతి ఆవేదన వర్ణణాతీతం. భర్త మృతదేహంపై పడి ఆమె చేస్తున్న రోదనలను చూసి స్థానికులు కంటతడిపెట్టారు.  

ఉన్నత చదువు చదివినా ఉద్యోగం కోసం ప్రాకులాడకుండా ట్రాక్టర్లతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. 20 రోజుల క్రితం నచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. జీవితం సంతోషంగా సాగుతుందనే క్రమంలో విధి చిన్న చూపు చూసింది. పెళ్లి పందిరి కూడా తీయకుండానే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతలోకాలకు చేరుకున్నాడు. 20 రోజులకే భర్త మృతి చెందడం, వైధవ్యం కలగడంతో ఆ యువతి చేస్తున్న రోదనలు అన్నీఇన్నీ కావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement