కర్నూలు : నగర శివారులోని జొహరాపురం రస్తాలో మంగళవారం చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనపై పోలీసు దర్యాప్తు వేగవంతమయ్యింది. పేలుడు ఘటనలో కర్నూలునగరంలోని బుధవారపేటకు చెందిన జంపాల రాజశేఖర్, జంపాల మల్లికార్జున, ఏఎస్‌ఐ శ్రీనివాసులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు గురువారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. సీసీఎస్, బాంబ్ స్క్వాడ్, డీఎస్పీ క్రైం పార్టీ సిబ్బందితో కలిపి మొత్తం 10 మందితో కూడిన ప్రత్యేక బృందం ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మల్లికార్జున పర్యవేక్షణలో ఈ బృందం సభ్యులు ఆధారాలను సేకరిస్తున్నారు. బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలిస్తూ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
ఫోన్‌కాల్స్ డేటాను కూడా సేకరిస్తున్నారు. ఫ్యాక్షనిస్టుల అనుచరులు, పాత నేరస్తుల ఫోన్ నంబర్లపై నిఘా ఉంచి పేలుడు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఎక్కువ సమయం ఏ ఫోన్లకు కాల్స్ వెళ్లాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటనకు ముందు వారం రోజుల నుంచి ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం మాట్లాడిన ఫోన్ నంబర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. సమీపంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీలో 15 రోజులకు సంబంధించిన డేటాను సేకరించి పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజల నుంచి కూడా వివరాలను సేకరిస్తున్నారు. కర్నూలు నగరంలోని ఒక్కొక్క పోలీస్‌స్టేషన్ పరిధిలో వందకు పైగా సీసీ కెమెరాలు ఆయా కాలనీల్లో ఉన్నాయి. ప్రధానంగా నంద్యాల చెక్‌పోస్టు నుంచి జొహరాపురం వెళ్లే మార్గం గుండా కాలనీల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా నేరస్తుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. జొహరాపురం బ్రిడ్జి వద్ద నుంచి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే మార్గంలో కొత్తగా సీసీ కెమెరాల లైన్ ఏర్పాటు చేశారు. అందులో కూడా నేరస్తుల కదలికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment