పెట్టుబడిదారుల చిట్టా దొరికింది! | Investors List Relese in Heera Group | Sakshi
Sakshi News home page

పెట్టుబడిదారుల చిట్టా దొరికింది!

Published Sat, Dec 15 2018 9:49 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Investors List Relese in Heera Group - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్లల్లో వేల కోట్ల టర్నోవర్‌ సాగించిన, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసుల కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు సంబంధించిన సర్వర్‌ను గుర్తించిన పోలీసులు అందులో ఉన్న డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది ఇన్వెస్టర్ల జాబితాను సేకరించారు. దీనిని విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపిన సీసీఎస్‌ టీమ్‌ అవసరమైతే సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) సహకారం తీసుకోవాలని భావిస్తోంది. మరోపక్క తమకు మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నౌహీరా షేక్‌ శుక్రవారం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. తిరుపతికి చెందిన నౌహీరా షేక్‌ హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా ఇస్లామిక్‌ బిజినెస్‌ గ్రూప్‌ పేరుతో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్‌ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు.

ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగినట్లు గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో డబ్బు ఎక్కడకు పోయిందనే విషయంపై దృష్టి కేంద్రీకరించారు. వీటిపై నౌహీరా షేక్‌ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోతుగా ఆరా తీసిన సీసీఎస్‌ పోలీసులు బంజారాహిల్స్‌ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో సర్వర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వర్‌ను ప్రాథమికంగా అధ్యయనం చేసిన సీసీఎస్‌ పోలీసులు 1.7 లక్షల మంది ఈ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. వీరిలో అత్యధికులు మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. వీటిని విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలని సీసీఎస్‌ భావిస్తోంది.

ఈ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తేనే ఆ 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా? లేక బోగస్‌ వ్యక్తులా? వీరు పెట్టిన పెట్టుబడులు ఎటు వెళ్లాయి? తదితర అంశాలు తెలుస్తాయని సీసీఎస్‌ అధికారులు తెలిపారు. దీనికోసం డేటాను ప్రాథమికంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపిన అధికారులు ఆ నివేదిక ఆధారంగా బ్యాంకుల నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఆపై ఎస్‌ఎఫ్‌ఐఓ సహకారంతో లోతుగా దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు. మరోపక్క నౌహీరాను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. అదే సమయంలో వచ్చిన ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కింది కోర్టు నౌహీరాకు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమె తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తమ బెయిల్‌ రద్దు చేయడానికి సవాల్‌ చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ప్రస్తుతం పుణేలో ఉన్న నౌహీరాను కంటోన్మెంట్‌ పోలీసులు గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు.

ఆమె పోలీసు కస్టడీ గడువు ముగియడంతో న్యాయస్థానం ఈ నెల 27 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే రూ.165 కోట్ల స్కామ్‌లో మరిన్ని వివరాలు సేకరించడానికి ఈమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కంటోన్మెంట్‌ పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నౌహీరాను సిటీకి తీసుకువచ్చి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్‌ కూడా పొందారు. ఓ ప్రత్యేక బృందం ముంబై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి నౌహీరాను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే నౌహీరా అరెస్టు తర్వాత ఆమెపై ముంబై, పుణేలతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వారంతా తమ కస్టడీల్లోకి తీసుకోవడానికి పీటీ వారెంట్లతో ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో ఆయా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌ తీసుకువెళ్లాలంటూ ప్రత్యేక బృందానికి ముంబై కోర్టు న్యాయమూర్తి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement