వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ శివ కుమార్
పెర్కిట్(ఆర్మూర్): మాయ మాటలు చెప్పి పలు చోట్ల బంగారు నగలు లూటీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని యాకూత్పురకు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ ఈనెల 8న బాల్కొండలో సల్లగరిగ రమేశ్ ఇంటికి చేరుకుని మీ తండ్రి గంగారాంకు లాటరీలో పల్సర్ బైకు బహుమతిగా వచ్చిందని మాయమాటలు చెప్పాడు. అనంతరం రమేశ్ దంపతులను ఆర్మూర్‌లో బహుమతి అందజేసే కంపెనీకి ఉన్నఫలంగా రావాలన్నాడు. ఈ క్రమంలో రమేశ్ తల్లి నుంచి మీ కుమారుడు నీ నగలతో పాటు కోడలు నగలను ఇవ్వమన్నాడని నమ్మించాడు. అనంతరం నగలను తీసుకుని ఉడాయించాడు. తాము దోపిడీకి గురయ్యామని గ్రహించిన బాధితుడు బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తు పట్టారు. శనివారం పెర్కిట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న రమేశ్ నిందితుడిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. తానే నగల లూటీ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. దీంతో ఆదివారం ఆఫ్తాబ్ అహ్మద్ షేక్‌ను రిమాండుకు తరలించారు.
17 కేసుల్లో నిందితుడు..
కాగా డ్రైవర్‌గా పని చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అఫ్తాబ్ అహ్మద్ షేక్ 17 కేసుల్లో నిందితుడని ఏసీపీ తెలిపారు. 2007లో చోరీలు మొదలు పెట్టిన నిందితుడు మహారాష్ట్ర కొల్లాపూర్‌లో అత్యాచారం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉమ్మడి జిల్లాలోని బాల్కొండతో పాటు బోధన్, నవీపేట్, వర్ని, బాన్సువాడ, కర్నాటక రాష్ట్రంలోని ఎంబీ నగర్‌లో చోరీలు చేశాడు. హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లూటీ చేసిన 14 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. పోలీసులకు దొరికిన ప్రతిసారి నోటి నుంచి రక్తం కారుస్తూ తనకు క్యాన్సర్ ఉందంటూ పోలీసులను సైతం అయోమయానికి గురి చేసేవాడు. నిందితుడి నుంచి రూ. 5లక్షల 40 వేల విలువగల 18 తులాల బంగారు నగలు, కర్నాటకలో చోరీ చేసిన రూ.60 వేల విలువ గల పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు నరేందర్, రాములు, రమేశ్, సురేందర్, ఖేర్ బాజీ, రాథోడ్‌లకు సీపీ కార్తికేయ ద్వారా రివార్డును అందిస్తామని ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment