మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు
యలమంచిలి : జాతీయ రహదారిపై పెద్దపల్లి జంక్షన్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందగా, ద్విచక్ర వాహనం దగ్ధమైంది. స్థానికులను నిశ్చేష్టులను చేసిన ఈ దుర్ఘటన వివరాలివి. ఆదివారం ఉదయం రామ్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రాపేటి అప్పనాయుడు(68) టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో పెట్రోల్ బంకులో పెట్రోలు కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో యలమంచిలి జాతీయ రహదారిపై పెద్దపల్లి జంక్షన్ వద్ద విశాఖపట్నం నుంచి తుని వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న టీవీఎస్ వాహనం నడుపుతున్న రాపేటి అప్పలనాయుడు 10 అడుగుల దూరంలో పైకి ఎగిరి కిందపడి మృతిచెందాడు.
అదే సమయంలో కారు ద్విచక్రవాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో ద్విచక్రవాహనంలోని పెట్రోలు బయకువచ్చి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీఎస్ వాహనం కాలిబూడిదైంది. పెద్దపల్లి జంక్షన్‌లో జరిగిన ఈ సంఘటన కళ్లారా చూసిన స్థానికులు పరుగు పరుగున ప్రమాదానికి గురైన అప్పలనాయుడు వద్దకు చేరుకుని చూడగా అప్పటికే అప్పలనాయుడు ప్రాణాలు విడిచారు. అదే సమయంలో కారు వద్దకు చేరుకుని కారులో ప్రమాణిస్తున్న వారిని బయటకు దింపారు. కారుకు సమీపంలో కాలిపోతున్న ద్విచక్రవాహనాన్ని అతికష్టంపై దూరంగా తరలించారు. కారు నడిపిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అప్పలనాయుడు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతుడు అప్పలనాయుడు రైల్వేలో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేసి 10 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విశ్రాంత ఉద్యోగులకు అనేక సేవలందించినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మృతుడు అప్పలనాయుడు నివాస ప్రాంతం కావడంతో స్థానికులు ప్రమాదస్థలానికి అధికంగా తరలివచ్చారు. సంఘనటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ గొర్లెనారాయణరావు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment