ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్ర పోలీసుశాఖలో పెను సంచలనం. అవినీతి నిరోధక విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఎస్పీని.. ఐజీ స్థాయి అధికారి చెరపట్టడం తీవ్ర కలకలం రేపింది. పైగా బాధితురాలిఫిర్యాదును ఉన్నతస్థాయి అధికారులు తొక్కిపెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఒకవిధంగా రాష్ట్ర పోలీసు శాఖకు ఇది మాయనిమచ్చగా విమర్శకులు భావిస్తున్నారు.
సాక్షి, చెన్నై : ‘రక్షించాల్సిన వాళ్లే.. లైంగిక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారిణికే రక్షణ కరువైనప్పుడు ఇక సామాన్యులకు ఏ మాత్రం..’అన్నట్టుగా పోలీసుశాఖలో పరిస్థితి దిగజారింది. అవినీతి నిరోధకశాఖలో ఎస్పీ స్థాయి అధికారిణిని తన కోరిక తీర్చాలంటూ ఐజీ వేధించడం పోలీసు విభాగంలో కలకలం రేపింది. తనకు ఎదురు అవుతున్న వేధింపులకు విసిగి వేసారిన ఆ మహిళా అధికారి చివరకు సీఎం పళనిస్వామి కార్యదర్శి విజయకుమార్‌ను ఆశ్రయిం చారు. ఆ కార్యదర్శి నుంచి వచ్చిన సమాచారంతో ఏడీజీపీ సీమా అగర్వాల్ నేతృత్వంలోని బృందం విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది.
ప్రభుత్వంలోని పలు విభాగాలతో పాటుగా, పోఎసుశాఖలోని మహిళలకు లైంగిక వేధింపులు ఇటీవల పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే, ఏ ఒక్కరూ సాహసం చేసి ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. బాధ్యత గల పదవిలోని ఉన్నతాధికారుల వేధింపుల్ని భరిస్తూ మౌనంగా రోదించే మహిళా అధికారిణులు, సిబ్బంది ఎందరో ఉన్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పోలీసుశాఖలోని ఖాకీచకం వెలుగులోకి రావడం సర్వత్రా విస్మయం కలిగించింది. అది కూడా ఐజీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారిణిని తన కోరిక తీర్చాలని పదే పదే వేధిం చడాన్ని బట్టి చూస్తే, ఏ స్థాయిలో ఉన్నా, మహిళకు ఏదీ భద్రత అన్న ఆందోళన తప్పడం లేదు. అవినీతిని నిర్మూలించే బాధ్యత గల శాఖలో ఉన్న అధికారే తన కిందిస్థాయి అధికారిణిని వేధింస్తుండటం, చివరకు సీఎం సెల్ వరకు వ్యవహారం వెళ్లడం తీవ్ర సంచలనం కలిగించింది.
నిత్యం వేధింపులే..
అవినీతి నిరోధకశాఖలో ఐజీ స్థాయిలో ఓ అధికా రి ఉన్నారు. ఆయన కింద ఎస్పీ స్థాయిలో మహిళా అధికారిణి పని చేస్తున్నారు. ఇటీవల కాలంగా ఆ అధికారి కన్ను మహిళా అధికారిణి మీద పడింది. బాధ్యత గల పదవిలో ఉన్నామన్న విషయాన్ని మరిచిన ఆ అధికారి తనలోని కామాంధుడిని బయటకు తీశాడు. కోరిక తీర్చాలంటూ ఆ అధికారిణికి వేధింపులు ఇవ్వడం మొదలెట్టాడు. అసభ్యకర ఎస్‌ఎంఎస్‌లు పంపించడం, ఫోన్లో వేధించడం వంటి చర్యలకు పాల్పడటమే కాదు, తన చాంబర్‌లోకి రమ్మని పిలిచి బలవంతం చేయడం మొదలెట్టాడు.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
నెల రోజులుగా ఐజీ స్థాయి అధికారి వికృత చేష్టలు శృతి మించాయి. దీంతో విసిగి వేసారిన ఆ అధికారిణి ఏసీబీ డైరెక్టర్ జయంత్ మురళికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తన విభాగం పరువు పోతుందేమోనన్న బెంగ కాబోలు, ఆ ఫిర్యాదును ఆయన తుంగలో తొక్కినట్టుసంకేతాలు ఉన్నాయి. దీంతో చివరకు డీజీపీ టీకే రాజేంద్రన్, హోంశాఖ కార్యదర్శి నిరంజన్ మార్టిన్‌లకు ఆమె ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కూడా స్పందన కరువు కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ అధికారిణి పది రోజులుగా మెడికల్ లీవ్ పెట్టి విధులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా, ఆ ఐజీ స్థాయి అధికారి నుంచి వేధింపులు మాత్రం తగ్గలేదు. చివరకు సీఎం కార్యదర్శి విజయకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఐజీ బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఎం పళనిస్వామి కార్యదర్శి విజయకుమార్ హోం శాఖ కార్యదర్శి నిరంజన్ మార్టిన్, డీజీపీ రాజేంద్రన్‌ను ప్రశ్నించడంతో వ్యవహారం బయటకు వచ్చింది.
రంగంలోకి విచారణ కమిటీ..
సీఎం కార్యదర్శి విజయకుమార్ జోక్యంతో చకచకా ఆయా అధికారుల్లో కదలిక వచ్చింది. ఆగమేఘాలపై విచారణకు కమిటీని నియమించినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. అదనపు డీజీపీ సీమా అగర్వాల్ నేతృత్వంలో మరో ఏడీజీపీ అరుణాచలం, డీఐజీ తెన్ మొళి, రిటైర్డ్ ఎస్పీ సరస్వతి, సీనియర్ అధికారి రమేష్‌తో ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ అత్యవసరంగా విచారణ చేపట్టి ఉన్నది. ఓ మహిళా అధికారిణిపై ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు సంబంధించి తమిళనాట పోలీసు విభాగంలో ప్రప్రథమంగా విచారణకు ఏర్పడ్డ కమిటీ ఇదే కావడం గమనార్హం.ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు సంబంధిత ఐజీ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఆ ఐజీని తక్షణం విధుల నుంచి తప్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే, విచారణ సక్రమంగా జరగాలని, ఆ మహిళా అధికారిణికి న్యాయం జరగాలని పట్టుబట్టే పనిలో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment