మృతి చెందిన కుమారస్వామి
వర్ధన్నపేట : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి మండలంలోని కట్య్రాల శివారులో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్‌రావు కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథినికి చెందిన నస్కూరి కుమారస్వామి(42) వర్ధన్నపేట మండలం ఇల్లందలోని ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. బుధవారం తన పనులు ముగించుకుని ఆటోలో పంథినికి బయలుదేరాడు.
ఈక్రమంలో కట్య్రాల శివారు వరంగల్–ఖమ్మం రహదారి పెట్రోల్‌బంకు సమీపంలో గేదె ఢీకొట్టగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.
ఎమ్మెల్యే అరూరి పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారస్వామి టీఆర్‌ఎస్ కార్యకర్త కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ పంథినికి చేరుకుని కుమారస్వామి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, సర్పంచ్ బరిగెల సదానందం తదితరులు ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
రాయపర్తి : అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని సన్నూరులో గురువారం జరిగింది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన పి.నాగేశ్వర్‌రావు(28)తో పాటు మరో ఇద్దరు సన్నూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి ప్రవేశించగానే అతివేగంగా వస్తున్న సన్నూరుకు చెందిన ట్రాక్టర్ ఢీకొనడంతో నాగేశ్వర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment