వేధింపులతో కుమిలి.. గుండె చెదిరి..  | A woman suicide with the house harassment | Sakshi
Sakshi News home page

వేధింపులతో కుమిలి.. గుండె చెదిరి.. 

Published Thu, Nov 16 2017 12:51 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

A woman suicide with the house harassment - Sakshi

విజ్జూలత (ఫైల్‌), క్రిషిక రెడ్డి (ఫైల్‌)

మంచిర్యాల క్రైం: అత్తింటి వేధింపులతో ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురుకు ఉరేసి, ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. గుండెల్ని పిండేసే ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్‌లో గల మిమ్స్‌ హైస్కూల్‌ సమీపంలో నివాసం ఉంటున్న కేసిరెడ్డి విజ్జూలతారెడ్డి(26) తన కూతురు క్రిషికరెడ్డి(4)కి ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసింది. బాలిక చనిపోయిన తర్వాత ఆమె మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది.

ఉదయమే భర్త పెట్రోల్‌బంక్‌లో విధులకు వెళ్లగా, అత్తమామలు హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనకు ముందు విజ్జూలత తన భర్త రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి మన కూతురును చంపేసి.. నేనూ ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో వెంటనే రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చే సరికి అప్పటికే భార్య, కూతురు వేర్వేరు గదుల్లో ఫ్యాన్లకు శవాలై వేలాడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఏసీపీ గౌస్‌బాబా, ఎస్సై సతీశ్‌ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

ఐదేళ్ల క్రితం వివాహం.. 
మంచిర్యాలకు చెందిన కేసిరెడ్డి మోహన్‌రెడ్డి–పద్మ దంపతుల కుమారుడు రామకృష్ణారెడ్డితో ఊరు శ్రీరాంపూర్‌కు చెందిన పాగాల రాంరెడ్డి–అరుణ దంపతుల కూతురు విజ్జూలత వివాహం 2012 ఆగస్టు 8న జరిగింది. అపుడు రూ.15 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. మోహన్‌రెడ్డి తండ్రికి ఊరు శ్రీరాంపూర్‌ సమీపంలో ఐఓసీ పెట్రోల్‌బంక్‌ ఉంది. ఇందులోనే రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నాడు. నెల ఖర్చులకు రూ.7 వేల జీతం తీసుకుంటాడు. కాగా, వివాహం జరిగిన ఏడాదికి వీరికి కూతురు క్రిషికరెడ్డి జన్మించింది.

ప్రస్తుతం ఆ బాలిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతోంది. కూతురు పుట్టిన ఏడాది నుంచి విజ్జూలతకు అత్తమామలు, ఆడపడుచు నుంచి అదనపు కట్నం వేధింపులతోపాటు ఇంటి విషయాల్లో సూటిపోటి మాటలు మొదలైనట్లు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. మామ మోహన్‌రెడ్డి వేధింపులు రోజురోజుకూ అధికం కావడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. తిరిగి పదిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ చేయించి విజ్జూలతను అత్తారింటికి పంపించారు. ఆ తర్వాత వేధింపులు మరింత అధికం కావడంతో మనస్తాపం చెందిన విజ్జూలత తన కూతురుకు ఉరివేసి, తానూ తనువు చాలించింది. 

సూసైడ్‌ నోట్‌లో ఏముంది.. 
బీటెక్‌ చదువుకున్న విజ్జూలత తాను చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌లో అత్తింటి వేధింపులను స్పష్టంగా రాసింది. తాను లేకపోతే తన కూతురు తల్లిలేని పిల్ల అవుతుందనే చిన్నారిని కూడా చంపుతున్నట్లు ఎంతో ఆవేదనతో పేర్కొంది.

‘‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో. ఆమెకు ఇష్టం లేకపోతే వచ్చేదాన్ని కూడా ఇలాగే టార్చర్‌ చేస్తారు. నిన్ను కూడా టార్చర్‌ చేస్తారు. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడం. ఇది కూడా మీ అమ్మకు ఇష్టం లేదు. ఆమెకు ఎన్ని పనులు చేసినా అంతే.. గిన్నెలు కడగకపోతే పోలీస్‌ ఆంటీ ఇంటికి పోయి చెప్పుతుంది. అన్ని పనులూ చేసి ఒకనాడు కడుపునొస్తుందని కూర్చున్న. ఆ ఒక్కరోజే గిన్నెలు కడగలేదు. నువ్వు మీ అమ్మ మాట దాటకు సరే. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మీ నాన్నకేమో ఇంకా కట్నం కావాలని ఉంది. మీ అమ్మానాన్నలకు మా నాన్నంటే ఇష్టం లేదు. అందుకే నా మీద పగ తీర్చుకుంటున్నారు. నా కూతురు తల్లిలేని పిల్ల కావద్దనే ఆమెను కూడా చంపేస్తున్నా. నువ్వు మీ అమ్మానాన్నలతో.. ముఖ్యంగా మీ అక్కతో సంతోషంగా ఉండు. మ్యారేజీ అయినప్పటి నుంచి నీవు రూ.7 వేలు శాలరీ కింద పనిచేస్తున్నావు. నేను చనిపోగానే.. నీకు మీ అమ్మ నాన్న, అక్క శాలరీ పెంచుతారు’’. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement