చందన మృతదేహం
రాయచోటి టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అన్యోన్య జీవితాన్ని గడుపుదామన్నాడు. కోర్కెలకు రెక్కలు తొడిగాడు. చివరికి అనుమానించి వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు తాళలేక తన చిన్న బిడ్డను అనాథగా చేసి తనను తాను శిక్షించుకొంటూ చివరకు ఉరి వేసుకొని ఊపిరి తీసుకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని స్వగ్రామం నుంచి వెనక్కు తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం గడికోట గ్రామం మాధవాండ్లపల్లె గ్రామానికి చెందిన శ్రీనాథరెడ్డి ఎమ్మెస్సీ చదివాడు. లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లెకు చెందిన చందన (27) అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
ఇద్దరూ డిగ్రీలు పూర్తి చేసి రాయచోటి జగధాంబ సెంటర్‌లోని డిష్ రెడ్డెన్న వీధిలో కాపురం పెట్టారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె ఉంది. శ్రీనాథరెడ్డి జీవనోపాధి కోసం ఒక ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు. ఆమె గతంలో బ్యాంక్ కోచింగ్ కూడా వెళ్లి వచ్చింది. అయినా ఉద్యోగం రాలేదు. ఇద్దరికీ ఉద్యోగం రాకపోవడంతో రాయచోటిలోనే విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో వీరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ గురువారం తన భర్త ఇంటిలో లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకొంది. రాత్రి 9గంటల తరువాత ఇంటిలోకి వచ్చిన భర్త గుట్టుచప్పుడు కాకుండా చాకచక్యంగా మృతదేహాన్ని తన స్వగ్రామైన గడికోటకు తీసుకెళ్లాడు.
తన స్వగ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నాడు. అయితే విషయం పోలీసులకు తెలియడంతో అర్బన్ సీఐ తన సిబ్బందిని గడికోటకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. విధిలేని పరిస్థితిలో మృతదేహాన్ని తిరిగి వెనక్కు తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె మెడకు ఉరి వేసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆత్మహత్య చేసుకొందని నిర్ధారించుకొని కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్‌ఐ గోవింద్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment