రక్తనిధికి 30 శాతం రక్తం ఇవ్వాల్సిందే!
–ఏపీ శ్యాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి
కర్నూలు(హాస్పిటల్): ప్రై వేటు రక్తనిధులు క్యాంపుల ద్వారా సేకరించే రక్తంలో 30శాతం రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ శ్యాక్స్(ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిని పరిశీలించారు. రక్తనిధిలోని రక్త ప్యాకెట్ నిల్వలను పరిశీలించారు. రక్తం సేకరించిన తేది, ఎక్స్‌పైరీ తేదీలను చూశారు. ఇందులో రెండు ప్యాకెట్లు కాలం తీరిపోయి ఉండటాన్ని ఆమె గమనించి సిబ్బందిని మందలించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు అవసరం మేరకే నిర్వహించాలని, అవసరం లేకుండా చేసి ఇలా రక్తాన్ని వృథా చేయవద్దని సూచించారు. రక్తదాతకు పరీక్ష చేసేటప్పుడు హెచ్‌ఐవీ పాజిటివ్ వస్తే ఐసీటీసీలో లింక్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రిలోని హెచ్‌వోడీలతో సమావేశమై వారి రక్తం అవసరాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకుంటే డిమాండ్ ఎంత ఉందో తెలుస్తుందన్నారు.
రెడ్‌క్రాస్ రక్తనిధి నుంచి 30 శాతం రక్తం ఇవ్వడం లేదని అక్కడున్న వైద్యులు జేడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తాము ఇప్పటికే నెలకు 100 మందికి పైగా తలసీమియా రోగులకు రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అందుకే 30 శాతం రక్తాన్ని ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చారు. తలసీమియా రోగులకు ఇచ్చినా నిబంధనల ప్రకారం ప్రభుత్వ రక్తనిధికి 30 శాతం రక్తాన్ని ఇచ్చి తీరాల్సిందేనని ఆమె ఆదేశించారు.
అన్ని ప్రైవేటు రక్తనిధులు ఈ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రూపశ్రీకి సూచించారు. అనంతరం ఆమె ఐసీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వారానికి ఒకసారి ఏఆర్‌టీ సెంటర్‌కు రాని హెచ్‌ఐవీ బాధితుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం లేదని గుర్తించి మందలించారు. ఆమె వెంట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డివిజనల్ అసిస్టెంట్ పీటర్ పాల్, జిల్లా మేనేజర్ అలీ హైదర్, బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవతి, ఐసీటీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.