వ్యవసాయాధికారులకు మొబైల్‌ యాప్‌ | agriculture Mobile App | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారులకు మొబైల్‌ యాప్‌

Published Tue, Aug 30 2016 6:33 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయాధికారులకు మొబైల్‌ యాప్‌ - Sakshi

వ్యవసాయాధికారులకు మొబైల్‌ యాప్‌

కడప సెవెన్‌రోడ్స్‌:
ఖరీఫ్‌ పంట కోత అంచనా ప్రయోగాలు సక్రమంగా నిర్వహించాలని చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ తిప్పేస్వామి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏఎస్‌ఓలు, వ్యవసాయ విస్తరణాధికారులు, హార్టికల్చర్‌ అధికారులకు ఈ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పంట దిగుబడి వివరాల ఆధారంగా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), జిల్లా స్థూల దేశీయోత్పత్తి (డీడీపీ)లను రూపొందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. 2016–17 సంవత్సరంలో వరి, జొన్న, సజ్జ, కంది, పత్తి, పొద్దుతిరుగుడు, పసుపు, చెరుకు పంటలను నోటిఫై చేశారని వివరించారు. వరి పంటను గ్రామం యూనిట్‌గా తీసుకుంటారని చెప్పారు. ఎంపికైన పంట కింద కనీసం 100 హెక్టార్ల విస్తీర్ణం గల గ్రామాన్ని ఒక బీమా యూనిట్‌గా పరిగణిస్తారన్నారు. పంట విస్తీర్ణం వంద హెక్టార్ల కంటే తక్కువగా ఉంటే ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న మరో గ్రామాన్ని కలిపి ఒక బీమా యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నారు.

ఒక మండలంలోని గ్రామాన్ని మరో మండలంలోని గ్రామంతో కలపరాదన్నారు. ఒక మండలం మొత్తంలో ఎంపిక చేసిన పంట విస్తీర్ణం వంద హెక్టార్లు ఉంటే ఆ మండలాన్ని ఒక బీమా యూనిట్‌గా పరిగణించాలన్నారు. ఒక మండలంలో ఎంపిక చేసిన పంట విస్తీర్ణం వంద హెక్టార్ల కంటే తక్కువగా ఉంటే వరుసగా ఉన్న మండలాలను కలిపి ఒక బీమా యూనిట్‌గా చేయాలన్నారు. బీమా యూనిట్‌గా ఒకే గ్రామమైతే నాలుగు పంట కోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. రెండు నుంచి  ఐదు గ్రామాలు బీమాయూనిట్‌ అయినా ఇదే వర్తిస్తుందన్నారు. అంతకంటే ఎక్కువ గ్రామాలైతే 10, ఒక మండలమంతా బీమా యూనిట్‌ అయితే 10, ఒకటి కంటే ఎక్కువ మండలాలైతే 16 పంట కోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. వరికి సంబంధించి జిల్లాలో 61 గ్రామాల్లో సీసీ ప్రయోగాలు జరగాలన్నారు. ఖరీఫ్‌లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 36,788 హెక్టార్లు కాగా, 3876 హెక్టార్లలోనే సాగైందన్నారు. వివిధ పంటలకు గాను ఖరీఫ్‌లో 916, రబీలో 670 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో మామిడి, నిమ్మ, అరటి, టమోటా, పసుపు, ఉల్లి, వంగ పంటలు ఇన్సూ్యరెన్స్‌ కింద ఉన్నాయన్నారు. సీసీ ప్రయోగాలు 50 శాతం గణాంకశాఖ, మరో 50 శాతం వ్యవసాయశాఖ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పండ్లు, కూరగాయలకు సంబంధించిన ప్రయోగాలను 50 శాతం గణాంకశాఖ, 50 శాతం ఉద్యానశాఖ అధికారులు నిర్వహించాలన్నారు. పంట కోత ప్రయోగాలను గణాంకశాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని వివరించారు.
సిబ్బందికి మొబైల్‌ యాప్‌...
పంట కోత ప్రయోగాలు నిర్వహించే సిబ్బందికి ప్రభుత్వం త్వరలోనే కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ ఇవ్వనుందని సీపీఓ వెల్లడించారు. ఇప్పటిదాక ప్రయోగ వివరాలను ఫోన్‌ ద్వారా తెలుసుకుని జిల్లా కేంద్రం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పంపుతున్నామన్నారు. ఇక క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రయోగ వివరాలను నేరుగా అర్థ గణాంక శాఖకే పంపించే వెసలుబాటు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ ఠాకూర్‌నాయక్, ఉద్యానశాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement