డబ్బు గెలిచింది.. రక్త సంబంధం ఓడింది !
డబ్బు గెలిచింది.. రక్త సంబంధం ఓడింది !
Published Wed, Nov 2 2016 12:41 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
- అనారోగ్యం పాలైన వ్యాపారి
- వైద్యానికి డబ్బు ఇవ్వని కుటుంబీకులు
- మనస్తాపంతో ఆత్మహత్య
- శవాన్ని మున్సిపాల్టీకి అప్పగించండని సూసైడ్ నోట్
ధనం ముందు రక్త సంబంధాలు కూడా ఓడి పోతున్నాయనేందుకు విషాద ఘటన ఓ నిదర్శనం. ఓ వ్యాపారి తన కుటుంబం కోసం అహర్నిషలు కష్టపడ్డాడు. ఇల్లు అనక.. ఊరనక.. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో వ్యాపారాలు చేసి రూ. లక్షలు ఆర్జించాడు. ఓ బంధువును నమ్మి సంపాదించినంతా అతని చేతిలో పెట్టి అవసరానికి ఇవ్వమన్నాడు.ఽ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే కుటుంబీకులు పైసా కూడా ఖర్చు పెట్టనీయలేదు. జీవితాంతం అతనుఽ తన వాళ్ల కోసం కష్టపడితే వాళ్లు మాత్రం ఆయన చావు కోసం ఎదురు చూశారు. తీవ్ర మనస్తాపానికి చెంది పోలీసులు అధికారులకు, మీడియాకు సూసైడ్ నోట్ పంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
- నందికొట్కూరు
నందికొట్కూరు పట్టణంలో ఓ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన సూసైడ్ నోట్ వివరాల మేరకు.. పట్టణంలోని సుబ్బారావు పేటకు చెందిన వ్యాపారి సుబ్రమణ్యం (65)కు భార్య సాయి కృష్ణమ్మ, పెద్ద కుమారుడు శివకుమార్, చిన్న కుమారుడు కిషోర్‌కుమార్ ఉన్నారు. అతను చేపలు, నాపరాయి, పొగాకు, పత్తి తదితర వ్యాపారాలు చేస్తూ రూ. లక్షలు ఆర్జించాడు. 2001లో భార్య చిన్నాన్న లగిశెట్టి శ్రీనివాసులకు రూ. 12 లక్షలు ఇచ్చాడు. 2009లో సుబ్రమణ్యం అనారోగ్యానికి గురైతే ఆపరేషన్ చేయించేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. శ్రీనివాసులు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కుల పెద్దల వద్ద పంచాయితీ పెడితే కుటుంబసభ్యులకు ఇచ్చినట్లు ఆయన చెప్పడం, వారు కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మొదటి నుంచి చేతిలో డబ్బులు ఉండటం చివరి దశలో అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చూయించేందుకు డబ్బులు లేకపోవడంతో కుంగిపోయాడు. నమ్మిన బంధువు కూడా మోసం చేయడంతో తట్టుకోలేక పోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే సూసైడ్‌నోట్ తయారు చేశాడు. కుటుంబీకుల మీద కోపంతో చివరకు తన శవాన్ని వారికి ఇవ్వకుండా మున్సిపాలిటీకి ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. తనకు రూ, 2.38 లక్షల అప్పు ఉందని, తన పేరు మీద ఉన్న ఆస్తులను అమ్మి వారికి ఇవ్వాలని కోరాడు. పోలీసులు అధికారులకు, మీడియాకు సూసైడ్ నోట్ కొరియర్ పంపాడు. అది వారికి చేరేలోపే మంగళవారం తెల్లవారు జామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement