రాజన్న సన్నిధిలో కేసీఆర్ కుటుంబం
వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం కుటుంబ సమేతమంగా వేములవాడ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు దేవస్థానం చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ ఈఓ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేసిన కేసీఆర్ దేవాలయంలో లక్ష్మీ గణపతి పూజ, రుద్రాభిషేకం, శ్రీమాత పూజ, రాజేశ్వరీ అమ్మవారి పూజ నిర్వహించారు. ఆ తర్వాత వేములవాడ రాజరాజేశ్వరీ దేవస్థానం ఆచారం ప్రకారం ఆశీర్వచనం ఇచ్చారు. ప్రముఖ వేద పండితుడు పూరాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
ఈ కార్యక్రమాల్లో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారధి చెర్మైన్ రసమయి బాలకిషన్, ఎంపీలు బి.వినోద్ కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. శివ దీక్ష పుస్తకావిష్కరణ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థాన అనువంశిక అర్చకుడు ఈశ్వరగారి నరహరి శర్మ రూపొందించిన శ్రీ శివదీక్ష’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
కాగా కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ యాగం వైదిక ప్రక్రియలన్నీ సోమవారం పరిసమాప్తం అయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన చండీ యాగం ఆదివారం నాటి పూర్ణాహుతితో పూర్తయింది. చండీ రూపాలయిన మహాకాళి, సరస్వతీ, మహాలక్ష్మీ విగ్రహాల ఉద్వాసన కార్యక్రమం సోమవారం ఉదయం 11.55 నిమిషాలకు ఎర్రవెల్లిలోని యాగశాలలో ప్రారంభమయింది.
శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్విజులు గోపికృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, తంగిరాల శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేయాల్సిన ప్రక్రియలను పూర్తి చేశారు. చండీ రూపాల ముందు నరసింహ హోమం నిర్వహించి దానికి సంబంధించిన పూర్ణాహుతి జరిపారు. కేసీఆర్ దంపతులు హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రుత్విజులు భారతీ తీర్థ ఆశీర్వాదం, చండీమాత శృతి తీర్థం కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. వేములవాడలో ప్రత్యేక పూజలు యాగశాల నుంచి నేరుగా కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు.