రాజన్నకు ఏటా రూ.100 కోట్లు
* ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ: కేసీఆర్
* నాలుగైదేళ్లపాటు రూ.100 కోట్ల చొప్పున నిధులిస్తాం
* వేములవాడ పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం
* రాజరాజేశ్వరస్వామికి సతీసమేతంగా కేసీఆర్ పూజలు
* ఆలయ పరిసరాలు, చెరువు గట్టు, పుష్కరిణి పరిశీలన
* 47 ఏళ్ల కిందట తన వివాహం ఇక్కడే జరిగిందన్న సీఎం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణకాశీగా ప్రఖ్యాతి పొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగైదేళ్లపాటు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అందులో భాగంగా తక్షణమే రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధికార సంస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తన వివాహం వేములవాడలోనే జరిగిందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజన్నను దర్శించుకుని వెళ్లి ఆమరణ దీక్షను ప్రారంభించానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కుటుంబ సమేతంగా వేములవాడ చేరుకున్నారు. తొలుత రాజన్న దేవాలయంలో తన సతీమణితోపాటు కుమార్తె కవిత దంపతులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను, గుడి చెరువును పరిశీలించారు. వేములవాడ శివార్లలోని నాంపల్లి గుట్టను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని, వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని.. మరో ఐదేళ్ల తరువాత మనం వచ్చింది వేములవాడకేనా అనేంత గొప్పగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘తెలంగాణలో సనాతనపుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దక్షిణ కాశీగా విలసిల్లుతున్న ఈ ఆలయాన్ని ఏటా లక్షలాది మంది దర్శించుకుంటున్నారు. కానీ పెరిగిన భక్తుల సంఖ్యకు తగినట్లుగా ఇక్కడ వసతులు లేవు. పట్టణం కూడా ఇరుకుగా ఉంది. శృంగేరి, కంచి కామకోఠి పీఠాధిపతుల శిష్యులను త్వరలోనే ఇక్కడికి పిలిపిస్తాం. స్థల పరిశీలన చేయించి వారి సూచనలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగైదేళ్ల పాటు నిధులు కేటాయిస్తాం. ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా.. గుడి చెరువును హుస్సేన్‌సాగర్ తరహాలో తీర్చిదిద్దుతాం. స్వామి వారి తెప్పోత్సవ నిర్వహణకు అనువుగా మార్చుతాం. బోటింగ్ ఏర్పాటుచేస్తాం. ఆలయ పుష్కరిణిని సైతం విస్తరిస్తాం. వేములవాడకు చుట్టూ ఉన్న రహదారులను విస్తరిస్తాం..’’ అని కేసీఆర్ చెప్పారు. రాజరాజేశ్వరస్వామి దేవాల యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆలయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం త్వరలోనే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నా వివాహం జరిగింది ఇక్కడే..
దాదాపు 47 ఏళ్ల కిందట తన వివాహం వేములవాడలోనే జరిగిందని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమరణ దీక్షకు వెళ్లే ముందు రాజరాజేశ్వరస్వామి దర్శనం చేసుకుని వెళ్లానని చెప్పారు. రాజన్న దయవల్ల తెలంగాణ సాధించుకోగలిగామని, తెలంగాణ వచ్చాక మళ్లీ వస్తానని మొక్కుకున్నానని పేర్కొన్నారు. నిజానికి ఎప్పుడో రావాల్సి ఉన్నా సమయాభావం, పనుల ఒత్తిడి వల్ల కుదరలేదని, ఇప్పటికి రాగలిగానని కేసీఆర్ చెప్పారు.