అంతా గందరగోళం
-
మురుగుకాలువల నిర్మాణంలో పక్షపాతం
-
తమ వారికో న్యాయం.. బయట వ్యక్తులకో న్యాయం
-
అధికార పార్టీ కార్పొరేటర్ సూచనలతో పనులు
-
డ్రెయిన్ల నిర్మాణ కొలతలను మార్చేస్తున్న వైనం
నెల్లూరు సిటీ: తమ వారికో న్యాయం..బయట వ్యక్తులకో న్యాయంగా అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 13వ ఆర్థిక సంఘ నిధులు రూ.13 కోట్లతో మురుగుకాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్లు తమ లబ్ధి కోసం పాకులాడుతున్నారు.
వంకర టింకర నిర్మాణాలు
కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లలో సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడేలా డ్రెయిన్లను నిర్మించాల్సి ఉండగా, అధికార పార్టీకి చెందిన వారి ఇళ్లు, దుకాణాల వద్ద సీసీ డ్రెయన్ల ప్లాన్లను మార్చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా వంకర టింకర కాలువల నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు కాలువల నిర్మాణ కొలతల్లో భవనానికి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేస్తామంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు, అధికారులు భవన యజమానులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి కాలువ నిర్మాణ పనులకు ముందు ఇంజినీరింగ్ అధికారులు కొలతలను తీసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని భవనాలు రోడ్డుపైకి నిర్మాణాలు చేసి ఉండటాన్ని గమనించిన కార్పొరేటర్, అధికారులు భవన యజమానితో బేరసారాలు చేస్తున్నారు. తమకు దక్కాల్సిన మొత్తం అందడంతో భవనం వద్ద కాలువ నిర్మాణాల కొలతలను మార్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాళ్లడిగిన మొత్తం ఇవ్వకపోతే నిర్మాణాలకు కూల్చేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు.
మురుగు ప్రవాహానికి అడ్డంకి
ప్రస్తుతం అధికారులు, అధికార పార్టీ నేతలు తమ లాభార్జన కోసం మురుగుకాలువల్లో కొలతలను ఇష్టానుసారంగా మార్చడంతో రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. వంకట టింకర నిర్మాణాలు జరగడంతో మురుగు ప్రవాహానికి అడ్డంకిగా ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి రోడ్డుపై ప్రవహించే అవకాశం ఉంది.
కార్పొరేటర్ భర్త ఇష్టారాజ్యం
31వ డివిజన్ ప్రజలు తమ సమస్యలను తీరుస్తారని ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్ తురకా అనిత భర్త సూరి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తనకు అధికారం ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని స్థానికులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. శ్రామికనగర్‌లో సూరికి చెందిన కొందరు ఇళ్ల వద్ద కాలువ ప్లాన్‌ను మార్చేసి నిర్మాణ పనులను చేయిస్తున్నారు. అధికారులు సైతం కార్పొరేటర్ చెప్పిన విధంగా నడుచుకుంటూ నిబంధనలను పక్కనబెట్టి ప్లాన్లను మార్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా నివసించే మహబూబ్ మస్తాన్ దుకాణం వద్ద 30 అడుగుల రోడ్డును 35 అడుగులుగా చూపి దుకాణాన్ని కూల్చేసేందుకు సూరి కుట్రపన్నారు. దీంతో సూరిని ఆయన ప్రశ్నించగా, పట్టించుకోలేదు. తన దుకాణాలను కూల్చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.